2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే త్వరలో జరగబోయే 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీకి ప్రెస్టేజియస్ గా మారాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ జట్టు కట్టడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నెలకొల్పడంతో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మమకారాన్ని పెంచుతున్నాయి.
అందులో భాగంగానే ప్రస్తుతం వైయస్ జగన్ మేమంతా సిద్ధం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రధాన అంశంగా మారాయి. గత కొన్నాళ్ళుగా తమ జెండా మోసి, సర్వశక్తుల పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలకు ఆయా పార్టీల నుంచి సీట్లు దక్కకపోవడంతో వారి స్వార్థపూరిత రాజకీయ విధానాలను అర్థం చేసుకున్న టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన నేతలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. ఈ చేరికలు ప్రధానంగా కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ జనసేన నుంచి జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాకినాడ జిల్లా నుండి ప్రారంభమై అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద అమలాపురం జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నేతలు సిద్ధమయ్యారు. ఇదే స్టే పాయింట్ వద్ద జనసేన నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి సీఎం జగన్ వైయస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారిలో అమలాపురం జనసేన సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, డీ ఎం ఆర్ శేఖర్, దుర్గాభవాని ఉన్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో డి ఎం ఆర్ శేఖర్ జనసేన పార్టీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో కూడా టిడిపి జనసేన నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.