ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13 వ తేదీన విజయవాడకు వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సతీష్ అనే నిందితుడు రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్ సిమెంట్ రాయి ముక్కతో దాడి చేసాడని పోలీసులు వెల్లడించారు.
అతడికి సహాయం చేసిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు చెబితేనే సీఎం జగన్‌పై సతీష్ దాడి చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చడం గమనార్హం. సతీష్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సతీష్‌ను అరెస్ట్ చేసి అతనికి మెడికల్ టెస్ట్‌లు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు.
కాగా సీఎం జగన్ పై దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మురంగా చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు, సెల్ ఫోన్ సిగ్నళ్లు, పబ్లిక్ తీసిన వీడియోలను పరిశీలించి అజిత్ సింగ్ నగర్ కి చెందిన సతీష్ ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు.