‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్ధాం’ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఈ ట్వీట్ జనసైనికులను అవాక్కలయ్యేలా చేసింది. తెలుగు తమ్ముళ్లకు కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడి చేతిలో కీలుబొమ్మ. కానీ ఒక్క ట్వీట్‌తో రాయుడు తనకు రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉందో చెప్పేశాడు.
రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాడు. కానీ కొద్దిరోజులకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెంతకు వెళ్లాడు. అయితే సీట్ల కూర్పుల్లో అవకాశం రాకుండా పోయింది. దీంతో రాయుడు మొదటి బాల్కే డకౌటైనట్లుగా భావించి అలకబూని నాకు ఈ రాజకీయాలు వద్దంటూ క్రికెట్ లీగ్‌లు ఆడాడు. బుధవారం జనసేన తన ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల చేసింది. అందులో అందరూ ఆశ్చర్యపోయేలా రాయుడి పేరుంది. దీనిని బట్టి యువత ఓట్ల కోసం అతడిని బతిమిలాడుకుని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
రాయుడికి రాష్ట్ర రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదని ట్వీట్ ఆధారంగా చెప్పొచ్చు. పవన్ టీడీపీతో పొత్తులో ఉన్నాడు. సీఎం కూటమి సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడేనని అందరికీ తెలుసు. ఈ విషయంలో జనసైనికులు అసంతృప్తిగా ఉన్నా సేనాని ఫుల్ సపోర్టు బాబుకే. తనకు బలం లేదని, బూత్ మేనేజ్మెంట్ చేసే కార్యకర్తలు లేరని, అలాంటప్పుడు పదవులు ఎలా ఆశిస్తానని ఇటీవల ఉమ్మడి సభలో పవన్ అన్నారు. గతంలో లోకేశ్ కూడా బాబే సీఎం అభ్యర్థి అని, ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని కుండబద్ధలు కొట్టాడు. ఈ నేపథ్యంలో రాయుడి ట్వీట్ టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
రాయుడికి పాలిటిక్స్‌పై ఏ మాత్రం ఆసక్తి లేదు. కానీ క్యాంపెయినర్‌గా పవన్ ప్రకటించారు. ప్రస్తుతం అతను ఐపీఎల్ మ్యాచ్‌లకు కామెంట్రీ చెబుతున్నాడు. మరి ఎప్పుడొచ్చి జనసేన తరఫున ప్రచారం చేస్తాడని సేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఒకటి, రెండు రోజులు వచ్చాడే అనుకుందాం. కూటమి సభలకు వెళ్లి పవన్‌ను సీఎం చేద్దామని చెప్పాడో.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బ్యాట్లు, స్టంప్లతో తరుముకుంటారు జాగ్రత్త రాయుడూ..