రాయలసీమ అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ జనసేన పొత్తు మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారే అన్ని చందాన ప్రవర్తిస్తుండటంతో టికెట్ల జారీ, పార్టీల మధ్య సమన్వయం వంటివి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అధినేత మాటే శిరోధార్యం అన్నట్టు ప్రవర్తించే కమ్మ సామాజిక తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ సారి తమ వాణి గట్టిగా వినిపించేందుకు సిధ్ధమైపోయారు.
వివరాల్లోకి వెళితే, అనంతపురం లో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏం నియోజక వర్గ నాయకుడికీ మరొకరితో సత్సంబంధాలు లేవు. జిల్లాల పునర్విభజన అనంతరం అనంతపురం, సత్యం సాయి జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను నియమించింది. కానీ వారి మాటల్ని సాధారణ కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పరిటాల అనుచరులతో, జేపీ అనుచరులతో ఇలా ఎవరికీ సత్సంబంధాలు లేవు. దానితో వారు ఒకరినొకరు ఓడించుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కధ మరొక రకం. గతంలో చిరంజీవి ఇక్కడి నుంచి గెలుపొందిన విషయం దృష్టిలో పెట్టుకుని, కాపుల ఓట్లు కూడా ఎక్కువగా ఉండటంతో జనసేన మొదటి నుంచీ తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ని కోరుకుంది. దానికి చంద్రబాబు కూడా సరేనన్నారు. కానీ, తిరుపతి వంటి నియోజకవర్గం టికెట్‌ను వదులుకోవడం ఇష్టం లేక సుగుణమ్మ కు జనసేన కండువా కప్పి ఆవిడకి టికెట్ ఇప్పించే పధకం రచించారు. జనసేన నుండి పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ ఇటువైపు సుగుణమ్మ ఎవరికి వారు ఆశావహం వ్యక్తం చేస్తుండగా, తిరుపతి వెంకటగిరి కమ్మ సామాజిక నేతలు మరొక కొత్త అంశాన్ని లేవనెత్తారు. కమ్మ వర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నందున ఈసారి సీటు కమ్మ వారికి ఇవ్వాలని, వారిని గెలిపించుకుంటామని అధినేత దృష్టి కి తీసుకెళ్ళారు. మరొకవైపు యాదవ సంఘం వారు తుడా మాజీ ఛైర్మన్ నరసింహ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటూ ముందుకొచ్చారు.
దీనితో, టీడీపీలోని కులాల కుమ్ములాటలూ, టీడీపీ జనసేన మధ్య పొత్తులాటలు బయటపడుతూ రాయలసీమలో టీడీపీ బలహీనమవడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.