ఈనాడు పత్రికను జగన్ పైన విషం చిమ్మడానికే రామోజీ పెట్టుకున్నట్లున్నాడు. నాడు నేడు కింద 45వేల పాఠశాలల రూపు రేఖలు మార్చింది వార్తే కాదు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడం చేత ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథమికోన్నత లేదా జిల్లా పరిషత్ స్కూల్ కు విద్యార్థులను పంపిస్తే మాత్రం భూతద్దంలో చూపిస్తూ పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు.
రామోజీరావుకు నూతన విద్యా విధానం వచ్చిందని తెలియదేమో. గతంలో ఉన్నట్లు ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి దాకా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకటి నుంచి అయిదు తరగతులుకు అదనంగా ఆరు, ఏడు తరగతులు ఉంటే మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, 6 నుంచి 10 దాకా ఉంటే జిల్లా పరిషత్ హైస్కూల్ లా ఉండేవి. ఇదే పద్ధతిని చాలా సంవత్సరాలు గా కొనసాగిస్తూ వస్తున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగు పడేలా టీచర్లు, విద్యార్థులపై ఒత్తిడి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టింది. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళే చిన్న పిల్లల నుంచి రెండో తరగతి దాకా ఫౌండేషన్ అని, మూడు నుంచి అయిదు దాకా ప్రిపరేటరీ అని, ఆరు నుంచి ఎనిమిది దాకా మిడిల్ స్కూల్ అని, తొమ్మిది నుంచి పన్నెండు దాకా సెకండరీ స్కూల్ అని నూతన పాలసీనీ ప్రవేశ పెట్టారు.
గతంలో ఒకటి నుంచి అయిదు తరగతి దాకా విద్యార్థులు సంఖ్య బట్టి అందరికీ కలిపి ఒకరే టీచర్ ఉండేవాళ్ళు. అన్ని తరగతులకి అన్ని సబ్జెక్టులు ఒకరే చెప్పేవారు తద్వారా టీచర్ పై భారం పెరిగేది. ప్రపంచంలో ఉన్న తోటి విద్యార్థులతో పోటీపడాలంటే అక్కడ వాళ్ళు అమలుపరుస్తున్న విద్యా విధానాన్ని అనుసరించి ప్రణాళికలు రచించుకోవాలి. అందులో భాగమే నూతన విద్యా విధానం.ఈ విధానం అమలులోకి వచ్చిందని రామోజీకి తెలియదేమో మరి.
ఈనాడులో ప్రచురించిన వార్త విషయానికి వస్తే, ప్రభుత్వం బలవంతంగా ప్రాథమిక పాఠశాలలును మూసివేస్తోంది తద్వారా టీచర్ల సంఖ్య తగ్గిస్తుందని. కానీ వాస్తవంలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న చోటు నుంచి ఒక కిలోమీటర్ పరిధిలోనే ఉన్న స్కూల్ కి పంపించి,నూతన విద్యా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం పైన రామోజీ పచ్చ రాతలు రాస్తునాడు.
చంద్రబాబు హయాంలో 1785 పాఠశాలలను మూసివేస్తే కనీసం ఒక చిన్న వార్త అయినా రాయని రామోజీ, ప్రభుత్వ స్కూల్ దండగ ప్రైవేట్ స్కూల్స్ ముద్దు అనేలా కార్పొరేట్ సంస్థలయినా నారాయణ, చైతన్యలకు అధిక మొత్తంలో డబ్బు రావాలని గత టీడీపీ ప్రభుత్వం పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తే రామోజీ కలం కదలదు. సామాన్య ప్రజల పిల్లలకు పాఠశాల విద్యను నాటి టీడీపీ ప్రభుత్వం దూరం చేస్తుంటే రామోజీ పెన్ను పెగలదు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు నాడు నేడు పథకం ద్వారా సరికొత్త రూపునిస్తుంటే మాత్రం ఈనాడు ఓర్చుకోలేదు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు నేడు క్రింద మూడు ఫేజ్ లలో 45 వేల పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో సిద్ధం చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడా ఈనాడులో వార్త రాయలేదు. పాఠశాలల రూపురేఖలతో పాటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రోత్సాహం కింద అమ్మ ఒడి, సిబిఎస్ఈ సిలబస్, ప్రతి పిల్లాడికి యూనిఫాం, బ్యాగ్, బుక్స్, షూస్ ప్రభుత్వమే ఇచ్చేలా, మిడ్ డే మీల్స్, చిక్కి , కోడిగుడ్డు ఇలా పౌష్ఠిక ఆహారం అందిస్తూ, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ,బైజుస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు అందిస్తూ, ఐబి సిలబస్ ఉండేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
3వ తరగతి నుంచే ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ ఉండేలా, ఇంగ్లీష్ పాఠాలు తెలుగులో అర్థం అయ్యేలా ఒక పక్క ఇంగ్లీష్ ఉంటే మరో పక్క తెలుగులో పాఠ్యాంశాలు ఉండేలా టెక్స్ట్ బుక్స్ రూపొందించి అందిస్తుంది . రాష్ట్ర విద్యా వ్యవస్థలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి జగన్ ప్రభుత్వంలో జరుగుతుంటే రామోజీ ఓర్చుకోలేక పచ్చ రాతలు చూస్తున్నాడు. రాష్ట్రంలో దేశీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు పర్యటించిన ప్రతీసారి రాష్ట్ర విద్యా విధానాన్ని, జగన్ ప్రభుత్వ పనితీరును భేష్ అని ప్రశంసిస్తుంటే రామోజీ మాత్రం పేద ప్రజల పిల్లలు ఎక్కడ ఎదిగిపోతారో అని అక్కసు వెళ్లగ్రక్కుతూనే వార్తలు రాస్తున్నాడు.