ఈనాడు రాసే ప్రతి అక్షరం వెనుక స్వార్థం ఉంటుంది. తనకు కావాల్సిన వారు ఉంటే ఒకలా రాస్తుంది. లేకప్పుడు అబద్ధాలు వల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇదే దాని సిద్ధాంతం. రాష్ట్రం విడిపోయాక ధోరణి మార్చింది. మొన్నటి వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన ఎక్కడ లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తాడు కాబోలనే భయంతో బాగా కావాల్సిన వాడిని చేసుకుంది. గత ఐదేళ్లపాటు ఇక్కడ ఆత్మ బంధువు చంద్రబాబు ఉన్నారు. అందుకని ఎవరికి చేయాల్సిన భజన వారికి చేసింది. కేసీఆర్‌ను చూసి బాబును నేర్చుకోవాలని ఏనాడూ చెప్పలేదు. బాబును చూసి నువ్వు మారాలి కేసీఆర్ అనే రాతల జోలికి పోలేదు. మరి ఏపీలో జగన్ వచ్చాక అక్షరాలు మారిపోయాయి. తెలంగాణను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నేర్చుకోవాలని చెప్పడం ఎక్కువైంది. అక్కడేదో అభివృద్ధి జరిగిపోతోంది. ఇక్కడ శూన్యమని అర్థమొచ్చేలా జనాలకు తప్పుడు సమాచారం అందించింది. కేసీఆర్ దిగిపోయినా ఆయనంటే భయం తగ్గలేదు. అదే సమయంలో బాబు ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి పదవిలో వచ్చాక ఈయనపై అమితమైన ప్రేమ మొదలైంది. టీఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తోంది.. ఏపీ సర్కారు తప్పులు చేస్తోందనే ధోరణిలో వార్తలు రాస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విద్యుత్ విధానం విషయమై సీఎం రేవంత్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. కేసీఆర్ అంతా నాశనం చేశాడని ఆయన ఆరోపిస్తున్నారు. నష్టాలపాలు చేశాడని ప్రెస్మీట్లలో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈనాడు దీనిని దాచి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్‌కు ప్రాధాన్యం ఇచ్చిందని కూసింది. కొత్త కాంగ్రెస్ సర్కారు అదే బాటలో నడుస్తోంది. నాణ్యమైన కరెంట్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్ పెరుగుతున్నా చేతులెత్తేయకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటోంది. కొత్త ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టింది. ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు సమీక్షించుకుంటూ కొరత రాకుండా చూసుకుంటోందంటూ రాసుకొచ్చింది. విద్యుత్ అంశంలో గత ప్రభుత్వంపై రేవంతుడు దుమ్మెత్తి పోస్తుంటే రామోజీరావు పత్రిక మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు చిడతలు వాయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా సర్దుకోకముందే ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టిందంటూ ఊహాజనితంగా రాసింది.
ఇదే ఏపీ విషయానికొస్తే ఎప్పటిలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద వేసింది. ముందుచూపు లేదట.. వేసవిలో కోతలు ఉన్నాయంట. టీఎస్‌లో స్వల్పకాలిక ఒప్పందాలు అద్భుతమని కొనియాడి ఏపీ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ కాదని పలికింది. అక్కడి విషయాలను ఆవు వ్యాసంలా మలిచి.. ఇక్కడేమో కాకిలెక్కలు పెట్టి తోచింది ప్రచురించింది. వాస్తవానికి జగన్ సీఎం అయ్యాక విద్యుత్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం తడబడిందంటూ ఈనాడు మిత్రులు తడబడి రాశారు. పైగా ఈ వార్తలకు యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఫొటో వేసి మురిసిపోయింది. కానీ జగన్ వచ్చాక నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన విషయాన్ని దాచేసింది. వాస్తవానికి కాంగ్రెస్ వస్తే విద్యుత్ కోతలు పెరుగుతాయని బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. కరెంటు పోతోందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తున్నాయి. మరి ఈనాడు కంటికి మాత్రం అక్కడ అద్భుతాలు కనిపించాయి. ఇలా రాసి తెలుగుదేశం నాయకుల్ని సంతృప్తి పరచగలరేమో గానీ.. ప్రజలు మాత్రం హర్షించరనే విషయాన్ని మర్చిపోతే ఎలా..