జగన్ ప్రభుత్వంపై అక్కసుతో నిలువెల్లా విషం నిండిన కథనాలు రాస్తున్న ఈనాడు మరోసారి తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టింది. నరం లేని నాలుక ఎన్ని వంకరలైనా తిరుగుతుందన్న సామెత చందాన విషం మాత్రమే నిండిన రామోజీ కలం అన్ని వంకరలు తిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలన్న దుగ్ద తప్ప మరో లక్ష్యమే లేని రామోజీ ఈసారి ఫీజులు పెంచు…. ఖజానా నింపు అనే ప్రభుత్వ వ్యతిరేక కథనాన్ని వండి వార్చాడు.
రామోజీ రెండు నాల్కల ధోరణి
రామోజీ కుటిల బుద్ది ద్వంద్వ వైఖరి ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఒక్క కథనం రుజువు చేసేస్తుంది. రిజిస్ట్రేషన్ల చార్జులు పెరగడాన్ని దోపిడీగా చిత్రీకరిస్తూ ఈనాడు రాసిన కథనాన్ని సరిగ్గా సంవత్సరం క్రితం అనగా జనవరి 30, 2023న రాసిన ‘తరిగిపోయిన స్థిరాస్తి కల’ అనే కథనంతో పోల్చి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో భారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతోందని, ఏపీలో పెరగడంలేదని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన రామోజీ సరిగ్గా ఏడాదికి తన నాలుకను అదే కలాన్ని మడతపెట్టి ఏపీలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని రాసుకొచ్చాడు.
రిజిస్ట్రేషన్ ఆదాయం తక్కువ ఉంటే పక్క రాష్ట్రమైన తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆదాయంతో పోలుస్తూ ఏపీలో పెరగడం లేదని వృద్ధి లేదని స్థిరాస్తి రంగం దెబ్బతిందని రాసుకొచ్చిన రామోజీ ఆదాయం పెరిగేసరికి తట్టుకోలేక ఆదాయం పెరిగిందని రాయడానికి మనసొప్పక దోపిడీకి తెరతీసిన ప్రభుత్వం అన్న చందాన వక్ర రాతలు రాసుకొచ్చాడు.
అప్పుడలా – ఇప్పుడిలా..
ఈనాడు గత సంవత్సరం రాసుకొచ్చిన కథనాన్ని పరిశీలిస్తే తెలంగాణలో 2015-16 సంవత్సరంలో రూ.3,786 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తే, ఏపీలో 3,585.12 కోట్లు ఉందని, 2021-22 నాటికి తెలంగాణలో రూ.12,429 కోట్లు ఆదాయం రాగా ఏపీలో రూ.7,345.38 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని రాశారు. ఈ కాలంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆదాయం బాగా పెరిగిందని, ఏపీలో పెరగడం లేదని పేర్కొన్నారు. 2019- 20 లో ఆంధ్రప్రదేశ్ లో రూ.4,886.65 కోట్లు రిజిస్ట్రేషన్ ఆదాయం ఉండగా, 2022 – 23 నాటికి రూ. 8,079 కోట్లు ఆదాయం పెరిగిందని ఇదే ఈనాడు పత్రిక రాయడం జరిగింది.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు,రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వినూత్న మార్పులు వల్ల ఇటీవల కాలంలో ఆదాయం బాగా పెరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను అంతటా పెంచేశారంటూ ఈనాడు పత్రిక చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రిజిస్ట్రేషన్ రేట్లు పెంపు అనేది శాస్త్రీయ పద్ధతిలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో కాకుండా 19% గ్రామాల్లో మాత్రమే చేయడం జరిగింది. గతంలో అన్ని గ్రామాలు పట్టణాలను పరిగణనలోకి తీసుకుని ఈ రిజిస్ట్రేషన్ రేట్లు పెంచడం జరిగింది. కార్డ్ సాఫ్ట్వేర్ ను ప్రైమ్ సాఫ్ట్వేర్ గా అప్ గ్రేడ్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలు సులభంగా వినియోగించుకుంటున్నారు. ఈ స్టాంపింగ్ విధానాన్ని తీసుకురావడంతో పాటు, డాక్యుమెంట్ విధానం కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు రిజిస్ట్రేషన్చేసుకునేందుకు వీలుగా వారికి అవసరమైన టైం స్లాట్ సెలెక్ట్ చేసుకునే విధానాన్ని కూడా జగన్ సర్కారు తీసుకురావడం జరిగింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న అనేక విన్నూత్న నిర్ణయాల కారణంగా రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెరిగింది.
ఆదాయం పెరిగినా తగ్గినా తప్పు పడుతూ విషపు రాతలు రాసే రామోజీకి జగన్ ప్రభుత్వంపై విషం చల్లడమే ప్రధాన అజెండాగా కనబడుతుంది. సరిగ్గా ఏడాది క్రితం ఆదాయం లేదని ప్రభుత్వంపై బురద జల్లిన డ్రామోజీ సంవత్సరం తిరిగేసరికి ఆదాయం పెరిగినందుకు విషపు రాతలతో రెచ్చిపోయాడు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజం విలువలు తుంగలో తొక్కుతూ ఓ పొలిటికల్ పార్టీకి లబ్ది చేకూర్చే రాతలు రాస్తున్న రామోజీ తన నిజస్వరూపాన్ని ఈ కథనం ద్వారా బయటపెట్టుకున్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.