రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా బీసీలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బీసీల ఆత్మీయ సమ్మేళన సభలో ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి బలమైన వర్గాలుగా తీర్చిదిద్దారని సీఎం జగన్ ని కొనియాడారు. బడుగు బలహీనవర్గాల ప్రజలు అగ్రవర్ణాలతో సమానంగా ఎదగాలన్న మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రావ్ కలలను సీఎం జగన్ సాకారం చేశారని చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబు బీసీల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేశాడని దుయ్యబట్టారు . ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబు కొత్త నాటకాలుకి తెర లేపాడు, మనం ఆ మాయలో పడకూడదని తెలియజేస్తున్నాను అని అన్నారు. బీసీ డిక్లరేషన్ అంటూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇదే సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి అభివృద్ధిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచినందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు.బీహార్,ఉత్తరప్రదేశ్ ,పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి బీసీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో తాను పర్యటించానని ఆయా రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు దక్కని ప్రాధాన్యాన్ని సీఎం జగన్ మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీలకు కల్పించారని కొనియాడారు. రాష్ట్ర క్యాబినెట్ లో 23 మంది మంత్రులు ఉంటే 11 మంది, 18 మంది ఎమ్మెల్సీల్లో ఉంటే 11 మందికి రాజ్యాధికారంలో బీసీలకు రికార్డ్ స్థాయిలో పదవులు ఇచ్చారని తెలిపారు.
11 రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బిసి ఒక ఎస్సి కి అవకాశం కల్పించారు. సంపన్న వర్గాల స్థానాల్లోనూ బీసీలకు అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంసించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీలకే 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టిన ఘనత వైఎస్ఆర్సిపిదేనన్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం 50% స్థానాల్లో వెనుకబడిన తరగతులకే కేటాయించారని, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ సీఎంలకు సవాల్ విసిరారని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్ ని సుప్రీంకోర్టు 24 శాతానికి తగ్గిస్తూ తీర్పిస్తే పార్టీ పరంగా మరో 20 శాతం పెంచి 44% స్థానాల్లో బీసీలకు ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకున్న నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతికి పాటుపడుతున్న వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని కృష్ణయ్య చెప్పారు. సిగ్గుమాలిన చంద్రబాబు హయాంలో బీసీలకు ఎంపీ, ఎమ్మెల్సీలు పదవులు ఎక్కడైనా ఇచ్చారా అని కృష్ణయ్య ప్రశ్నించారు. టిడిపి ఎప్పుడూ బీసీ లని ఓట్ల రూపంలోనే వాడుకుందని బీసీల కోసం టిడిపి చేసింది శూన్యం అని తెలిపారు.ఈ బీసీ ఆత్మీయ సభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తో పాటు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్, నిడుదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ,గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.