రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది . అన్ని పార్టీలు ప్రచార యుద్దానికి తెర లేపాయి. ఏపీ బిజెపి మొన్నటి వరకూ పొత్తుల పేరుతో కాలక్షేపం చేసింది చివరకు ఆరు లోక్ సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలు పొత్తు పంపకాల్లో దక్కాయి . దాని తరువాత కొన్ని రోజులు ఎవరు పోటి చెయ్యాలో ఎక్కడ పోటి చెయ్యాలో అని సగం రోజులు టైమ్ పాస్ చేసిన తరువాత చంద్రబాబు ఇచ్చిన అభ్యర్థుల లిస్టును బిజెపి పేరుతో రిలీజ్ చేశారు. అసలైన బిజెపి పాత నాయకులకి ఒక్కరికీ సీటు దక్కకపోగా చంద్రబాబు నమ్మిన బంటులకు సీట్లు దక్కాయి. అది కూడా టీడీపీ ఓడిపోయే సీట్లు బిజెపి తీసుకుంది. తిరిగి బిజెపి పోటీ చేసే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తాము అంటూ గొడవలు చేస్తున్నారు, రఘురామ కృష్ణంరాజు లాంటి నాయకులు అయితే రోజూ నరసాపురం పార్లమెంటరీ టికెట్ నాదే అంటూ ప్రగల్భాలు పలుకుతునే వున్నారు. వాటిని కనీసం ఖండించే నాయకుడు గానీ గొడవలు సర్దిచెప్పి పరిస్థితి చక్కదిద్దే వారు కానీ ఏపీ బిజెపి లో కనపడటం లేదు.
దాని తరువాత అసలైన బిజెపి కి, చంద్రబాబు బిజెపి కి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. అసలైన బిజెపి నేతలు ఏపీ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర బిజెపి పెద్దలకు లేటర్ వ్రాసి దాన్ని మీడియాకు లీకు చేశారు. దీనితో బిజెపి పెద్దలు ఈ రెండూ గ్రూప్ ల మధ్య సయోధ్య చేసి పంపించారు. అప్పటి నుండి రెండు వర్గాలు ఎవరికి వారే యమున తీరే చందాన వున్నారు. మధ్య లో టీడీపీ, జన సేన తో కలిసి కూటమి గా నరేంద్ర మోడితో ఓక సభ ఏర్పాటు చేశారు అంతే ఇక ఏపీ లో ఎలాంటి బిజెపి ప్రచారాలు జరిగిన సందర్భం లేదు. ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ప్రచార కమిటీ లు వేసింది లేదు లోకల్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది లేదు కనీసం కూటమి తరపున ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసింది లేదు.
ఏపీ బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి తాను పోటీ చేస్తున్న రాజమండ్రీలో ప్రచారం చేస్తున్నది లేదు , అదే టైంలో కూటమిలో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పంలో ప్రచారం మొదలు పెట్టుకోని రోజుకు మూడు నియోజకవర్గాలు చొప్పున తిరుగుతున్నారు. మరో పార్టీ అయిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా తను పోటి చేస్తున్న పిఠాపురంలో ప్రచారం చేయడం ప్రారంభించారు దానితో పాటు ఏప్రిల్ 12 వరకు ప్రచార షెడ్యూల్ రిలీజ్ చేశారు. కానీ ఏపీ బిజెపి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే లాగా చుక్కని లేని నావ లా వుంది. ఒకరిద్దరు బిజెపి అభ్యర్థులు ఏదో సొంతంగా ప్రచారం ప్రారంభించారు. కానీ వారికి అధ్యక్షురాలు పురంధేశ్వరి నుండి గాని పార్టీ సీనియర్ నేతలు నుంచి గానీ సపోర్ట్ దొరకడం లేదు.
ఏపీ బిజెపి గనుక ఇప్పటికైనా ప్రచారం మొదలు పెట్టకపోతే కనీస పోటీనిచ్చే పరిస్థితులు కూడా కనపడటం లేదు.