పొంగూరు నారాయణ.. దేశంలో కార్పొరేట్ విద్యా మాఫియాకు లీడర్. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడి క్యాబినెట్లో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. 24 ఎన్నికల్లో నెల్లూరు సిటీ తెలుగుదేశం అభ్యర్థి. ఈయన విద్యాసంస్థల్లో లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వారందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తన చేష్టలతో విద్యా సమాజానికే మాయని మచ్చ తెచ్చారు. ఆయన వ్యవహారశైలిపై సాక్షాత్తు కుటుంబసభ్యురాలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా ఏ ఆస్తి విషయమో కాదు. నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాజంలో పెద్ద మనిషిగా చెలమణి అవుతున్న వ్యక్తి నారాయణ. ఆయన చేసిన దారుణాలపై సొంత తమ్ముడి భార్య ప్రియ సోమవారం నేరుగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు.
నారాయణకు సుబ్రహ్మణ్యం (మణి) అనే తమ్ముడు ఉన్నారు. ఇతని భార్యే పొంగూరు కృష్ణప్రియ (ప్రియ). 29 సంవత్సరాల క్రితం వారికి వివాహమైంది. అప్పటి నుంచే బావ నారాయణ తనను లైంగికగా వేధిస్తున్నారని ప్రియ ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై కొంతకాలం క్రితం ఆమె సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. ఆ విషయం అప్పట్లో దుమారం రేపింది. ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో నారాయణ ఎలా ప్రవర్తించాడో ఆమె వివరించారు. అయితే అన్న మాటలు విని మణి తన భార్య ప్రియకు మానసిక సమస్యలున్నాయని, ఆస్తి కోసం ఇలా చేస్తోందని చిత్రీకరించారు. వాస్తవానికి నారాయణ విద్యాసంస్థల్లో చాలా సంవత్సరాలపాటు ప్రియ కీలక పదవులను నిర్వర్తించారు. ఆమె పిచ్చిదైతే పనులు ఎలా చెప్పారో అంటే సమాధానం మాత్రం లేదు. బావపై ఆరోపణలు చేశాక ప్రియ కొంతకాలం కనిపించలేదు. నారాయణ తన మనుషుల ద్వారా భయపెట్టి ఆమె నోరు మూయించారని ప్రచారం ఉంది.
సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రియ నెల్లూరు ఎస్పీని కలిశారు. అంతకుముందు పోలీస్ కార్యాలయానికి ప్రియ వెళ్లకుండా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. నారాయణ ఆదేశాలతో ఆమెను తమ వెంట తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ప్రియ తప్పించుకుని పోలీసుల వద్దకు వెళ్లింది. నారాయణ లైంగికంగా వేధింపులకు గురిచేసేవారని, భర్త మణి, అల్లుడు పునీత్ల నుంచి ప్రాణహాని ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఎస్పీని కోరారు. అనంతరం మీడియాతో వివరాలు చెప్పాలని ప్రయత్నించగా అప్పుడు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ధైర్యం విషయాలు చెప్పారు. తన బావ స్త్రీ లోలుడని ఆరోపించారు. ఒకప్పుడు నగరంలోని హరనాథపురం ఇంట్లో ఉంటున్న సమయంలో రకరకాలుగా హింసించాడని, అన్నం పెట్టుకుని తన గది రావాలని చెప్పేవాలని, వెళ్లకపోతే కొట్టేవాడని రోదించారు. ఈ విషయాలను భర్త దృష్టికి తీసుకెళ్తే బావ చెప్పినట్లు నడుచుకో అనేవాడన్నారు. లైంగిక వేధింపులు భరించలేక గతంలో హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. అప్పటి నుంచి నారాయణ మనుషులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనకు మానసిక సమస్యలున్నాయని ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని, అయితే వారి వేధింపులు ఆగలేదని బాధపడ్డారు. అలాగే అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తన వద్ద పక్కా ఆధారాలున్నాయని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీంతో ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. నీతి వాఖ్యాలు వల్లించే నారాయణ వీటికి సమాధానం చెప్తాడా.. లేక తన ఆర్థిక బలం ఉపయోగించి ఆమె నోరు మూయిస్తాడా..