‘సర్, ఇది మా చైర్మన్, ఎక్స్ మినిస్టర్ పొంగూరు నారాయణ మాట. ఎన్నికల్లో మీరు, మీ స్టాఫ్ తెలుగుదేశానికి సపోర్టు చేయండి. ఆ పార్టీ గెలిస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీ వాళ్లు ఎంతమంది ఉన్నారో చెబితే అమౌంట్ తెచ్చిస్తాం. ఇప్పుడు మీరు కామ్‌గా ఉంటే నష్టపోతారు. రేపు ఆయన మంత్రి అయితే అస్సలు పట్టించుకోరు. పైగా ఇబ్బందులు కూడా రావొచ్చు’ అంటూ నారాయణ విద్యాసంస్థలకు చెందిన ముఖ్యులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఓ వైపు బెదిరిస్తూనే.. మరోవైపు బతిమిలాడుకుంటున్నారు.
తెలుగుదేశానికి ఉన్న ఆర్థిక స్తంభాల్లో నారాయణ ఒకరు. ఈయన చంద్రబాబు నాయుడు ఏమి చెబితే అది చేస్తారు. ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ కలిసి అడ్డదారులు తొక్కుతున్నారు. నారాయణకు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో విద్యాసంస్థలున్నాయి. వాటిని అడ్డు పెట్టుకుని టీడీపీకి లబ్ధి చేయాలని చూస్తున్నారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సిటీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తొలుత జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ బడులు, కాలేజీల యజమానులకు నారాయణ మనుషుల నుంచి ఫోన్లు వెళ్లాయి. కచ్చితంగా సపోర్టు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఇంజినీరింగ్, పీజీ కాలేజీలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కొందరు చైర్మన్లతో నారాయణ నేరుగా మాట్లాడినట్లు సమాచారం. విద్యార్థులతో మాట్లాడాలని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చూడాలని వాటి యజమానులకు చెప్పారు. ఎవరైనా ఇప్పుడు సపోర్టు చేయకపోతే రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అధికారులను పంపి నిబంధనలు పాటించడం లేదని సీజ్ చేయిస్తామని భయపెడుతున్నారు. స్టాఫ్ వివరాలు తీసుకుంటున్నారు. సంఖ్యను బట్టి ప్యాకేజీలు మాట్లాడారు.
నారాయణ దీనిని నెల్లూరు జిల్లాకే పరిమితం చేయకుండా.. చంద్రబాబు అనుమతితో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. తన విద్యాసంస్థలకు చెందిన ముఖ్యులను అభ్యర్థులతో మాట్లాడించారు. అందరూ కలిసి ఆయా ప్రాంతాల్లో ఉండే స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలపై జులుం ప్రదర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది.