జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైకి చెప్పేదొకటి.. లోపల చేసేదొకటి. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని బిల్డప్ ఇస్తాడు. కానీ ఆయన పనులు చూస్తే చంద్రబాబు నాయుడికి, తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా ఉంటాయి. ఈ క్రమంలో సేనానిని నమ్ముకున్న అభిమానులు ఎప్పుడూ గొర్రెలవుతుంటారు.
భీమిలి సీటు జనసేనదేనని నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ దానిని మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావుకు పవన్ వదిలేశారు. వాస్తవానికి గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. ఆయన ససేమిరా అన్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోతానని బెదిరించారు. దీంతో బాబు దిగిరాక తప్పలేదు. పవన్‌తో మాట్లాడుకుని ఓకే చేయించుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. గంటా చాలా సంవత్సరాల నుంచి మెగా కుటుంబానికి సన్నిహితుడు. ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు. పైగా పవన్‌కు అవసరమైనప్పుడల్లా ఆర్థిక వనరులు సమకూరుస్తుంటాడు.
గంటా.. పవన్ మాట్లాడుకున్నారు. భీమిలి సీటు ఇస్తే భారీగా డబ్బు ఇస్తానని, వ్యక్తిగతంగా ఉంచుకున్నా.. లేక ఎన్నికల ఖర్చుకు వాడుకున్నా తనకేమి అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. అప్పటికే టికెట్ వస్తుందని పనిచేస్తున్న పంచకర్ల సందీప్ వ్యవహారం చూసుకోవాలని చెప్పగా సేనాని అంగీకరించారు.
సేనాని.. గంటా ద్వారా రూ.5 కోట్లు సందీప్‌కు ఇప్పించినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గంటా జనసేనలో చేరి టికెట్ తీసుకుంటారని మొదట ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే సందీప్‌కు ఇవ్వలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని, సేనకు చెడ్డపేరు ఇంకా పెరిగిపోతుందని, ఎన్నికల్లో పని చేయరని పవన్ భయపడ్డారు. పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చామని చెబితే నాలుగు రోజులు అరిచి ఆగిపోతారని భావించారు. చంద్రబాబు భీమిలి అభ్యర్థిగా గంటాను ప్రకటించగానే నిరసనలు వ్యక్తమవయ్యాయి. కార్యకర్తలు, పవన్ అభిమానులు ఇది కరెక్ట్ కాదని అరిచారు. అధినేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ డబ్బు మూటలు అందడంతో సందీప్ వెంటనే రంగంలోకి దిగి తనకు బాధగానే ఉందని, సేనాని నిర్ణయాన్ని గౌరవిద్దామని కలరింగ్ ఇచ్చారు. భవిష్యత్ బాగుంటుందని చెప్పారు.
సైనికుల ఆగ్రహావేశాలు చల్లారాక ప్రస్తుతం సందీప్ గంటా వెంట తిరుగుతున్నాడు. దీంతో చాలామంది జనసైనికులకు భీమిలి టికెట్ విషయంలో పవన్, గంటా, సందీప్ నాటకాలు తెలిసిపోయి తమను వెర్రిపప్పల్ని చేశారని బహిరంగంగానే చెబుతున్నారు. అధినేతను నమ్ముకుని డబ్బు, సమయం వృథా చేసుకున్నామని బాధ పడుతున్నారు. మాయ చేయడంలో సేనాని దిట్ట. ఎంతైనా చంద్రబాబు మనిషి కదా..