తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంలోనే అనేక రాజకీయాలు నడిచాయి. ఇక టికెట్ల కేటాయింపు సమయంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. ఇప్పటికి కూడా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల విభేదాల సెగ తగ్గలేదు. గొడవలు పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం బాబు.. పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకుని మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఏపీ అధ్యక్షురాలు దుగ్గబాటి పురందేశ్వరి ఫొటోలు కనిపించలేదు. బ్యానర్‌పై కూడా వారి ఫొట్లోల్లేవు. ఇక కమలం పార్టీ పరిశీలకుడు కనీసం మేనిఫెస్టో కాపీని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు.
2014లో ఇలాగే మూడు పార్టీలు కూటమి కట్టాయి. బాబు 650కి పైగా హామీలిచ్చాడు. ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదు. ఆయనకు మాటపై నిలబడడం అలవాటు లేకపోవడంతో బీజేపీ పెద్దలు మేనిఫెస్టోపై తమ ఫొటోలు వద్దని గట్టిగా చెప్పారని ప్రచారం జరుగుతోంది. బాబేమో వారు కేంద్ర స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేస్తారని, రాష్ట్రాల వాటితో సంబంధం లేదని కవర్ చేసుకున్నాడు. తాజాగా తెలుగుదేశం పార్టీ పత్రికలకు ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తోంది. ఇందులో బీజేపీ జనసేనకు స్థానం దక్కలేదు. సాధారణంగా సభలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లలో చంద్రబాబు, మోదీ, పవన్ ఫొటోలుంటాయి. కానీ ఎంతో ముఖ్యమైన యాడ్స్‌లో మాత్రం నారా వారు ఒక్కరే దర్శనమివ్వడం చర్చకు దారి తీసింది.
మేనిఫెస్టోపై ఫొటో విషయంలో బీజేపీ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తెలుగు తమ్ముళ్లు కోలుకోలేదు. తాజాగా జనసేన కూడా కమలం పార్టీ బాటలోనే నడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టో విడుదల చేశాక అందులోని హామీలను చూసిన జనం ఇవన్నీ అబద్ధాలని తేల్చేశారు. బాబు ఏనాడూ మాటపై నిలబడలేదని, ఒక్క హామీ కూడా నెరవేర్చడని నమ్ముతున్నారు. ఈ విషయం పవన్‌కు బాగా అర్థం కావడంతో యాడ్స్‌లో తన ఫొటో వద్దని చెప్పారని జనసైనికులు ప్రచారం చేస్తున్నారు. బాబే కావాలని జనసేనను సైడ్ చేశాడని, కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ హవానే ఉంటుందని చెప్పేందుకు ఇలా చేశారని తమ్ముళ్లు అంటున్నారు. నిజాలు ఆ దేవుడికి ఎరుక. మొత్తంగా ఇదొక మాయా కూటమని ప్రజలకు అర్థమైపోయింది.