జనసేన నేతల కళ్లు తెరుచుకుంటున్నాయి. తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కోసమే పనిచేస్తున్నాడనే నిజం తెలుసుకుని పార్టీని వీడుతున్నారు. ఈ మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సేన నేతల సంఖ్య పెరుగుతోంది.
జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికని, కొత్త తరం నాయకుల్ని తయారు చేస్తానని 2014 నుంచి పవన్ చెబుతూ వచ్చాడు. అయితే ఆచరణ మాత్రం వేరేలా ఉంది. చంద్రబాబు కోసమే ఆయన అడుగులు ఉండేవి. దీనిపై నాయకులు, కార్యకర్తలు అడిగితే సర్దిచెబుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో సేనాని పూర్తిగా ముసుగు తీసేశాడు. బాబును సీఎం చేయడమే తన లక్ష్యమన్నాడు. సీట్లు తక్కువగా తీసుకున్నాడు. అందులోనూ సగం టీడీపీ నేతలకే కండువాలు కప్పి ఇచ్చేశాడు.
సేనానిని నమ్ముకుని రాజకీయంగా అవకాశాలు వస్తాయని పనిచేసిన వారికి టికెట్లు దక్కలేదు. దీంతో మోసపోయామని వారంతా అర్థం చేసుకున్నారు. భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అమలాపురం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, విజయవాడ పశ్చిమ ఇన్చార్జి పోతిన మహేష్ వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కండువా కప్పించుకున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అతనితో ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు చర్చించారు. మనుక్రాంత్‌రెడ్డి విద్యావంతుడు. విదేశాల్లో కంపెనీలున్నాయి. పవన్ మాటలు నమ్మి నెల్లూరులో రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీ కార్యాలయాన్ని సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాడు. 2019లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 24లో సిటీ టికెట్ ఇస్తానని పవన్ చెప్పడంతో పనిచేసుకుంటూ వచ్చాడు.
అయితే సేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఇక మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చంద్రబాబు సీటు ఇచ్చేశాడు. పవన్ మనుక్రాంత్ను పిలిచి నారాయణ సేనకు డబ్బు ఇస్తున్నాడని, టికెట్ గురించి మాట్లాడొద్దని చెప్పాడు. ఆయన అధినేత నిర్ణయానికి సరేనన్నారు. ఈ సమయంలో స్థానికంగా కార్యకర్తల నుంచి పవన్‌పై వ్యతిరేకత రాగా సర్దిచెప్పారు. కానీ టీడీపీ నేతలు మనుక్రాంత్ను చులకనగా చూస్తున్నారు. ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని పవన్‌కు చెప్పినా నారాయణ చెప్పినట్లే నడుచుకోవాలని చెప్పారే తప్ప తాను మాట్లాడతానని అనలేదు. సొంత పార్టీ నేతలకు గౌరవం దక్కడంలేదన్నా సేనాని స్పందించకుండా టీడీపీ వారు చెప్పినట్లే ఆడాలనడం ఎవరికీ నచ్చలేదు.
పవన్‌ను ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా పోయిది. తన మాటకు ఎదురు చెప్పకుండా.. చెప్పినట్లు వినే సమూహం కావాలన్నాడు. కానీ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జనసేనను నడపడం చాలామంది నేతలు, కార్యకర్తలకు నచ్చడం లేదు. అందుకే పార్టీని వీడుతున్నారు. ఇంత జరుగుతున్నా సేనాని కళ్లు తెరుచుకోడు. ఎవరో ఒకరిని ఏమార్చి అది చేస్తా.. ఇది చేస్తానని బాధ్యతలు అప్పగిస్తాడు. వారు గొర్రెలవుతారు.