జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బొత్తిగా లోక జ్ఞానం లేదు. వ్యవస్థ ఎలా నడుస్తుందో.. అందులో ఏమి జరుగుతుందో అవగాహన శూన్యం. చంద్రబాబు కార్యాలయం నుంచి స్క్రిప్ట్ వస్తే ఊగిపోతూ చదివేస్తాడంతే.. కొంతకాలం క్రితం వలంటీర్ల వ్యవస్థపై ఆయన కన్ను పడింది. వాళ్లు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, నమ్మదగిన మనుషులు కాదంటూ అభాండాలు వేశాడు. సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సాక్షాత్తు ప్రభుత్వ ప్రతినిధులు వివరాలు తీసుకుంటే పవన్‌కు తప్పుగా కనిపించింది. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ చేస్తున్న డేటా చౌర్యం మాత్రం ఆయనకు కనిపించదు.
ఏమి జరిగిందంటే..
టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణకు దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు ఉన్న విషయం తెలిసిందే. దీనిని ఆయన అడ్డుపెట్టుకుని తమ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ రాష్ట్ర ఎలక్షన్ ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో ఏముదంటే.. ‘నారాయణ ఏపీలోని తమ విద్యాసంస్థల సిబ్బంది ద్వారా ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబ వ్యక్తిగత, సున్నిత సమాచారం తెలుసుకుంటున్నారు. ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులం, అతను సపోర్ట్ చేసే పార్టీ, మొబైల్ నంబర్, పోలింగ్ బూత్, ఐడీ నంబర్, బంధువుల వివరాలు, వార్డుల నంబర్లు తదితరాలను నమోదు చేసుకుంటున్నారు. నారాయణ పాల్పడుతున్న ఈ చర్యలు ఓటర్లను ఒత్తిడికి గురిచేయడం, ప్రలోభపెట్టడమే. సెక్షన్ 123 ఆఫ్ ఆర్పీ యాక్ట్ (1951) కిందకు వస్తాయి. తన శిష్యుడు నారాయణ ద్వారా చంద్రబాబు విద్యాలయాలను అపవిత్రం చేస్తున్నారు. తన విద్యాసంస్థల ద్వారా ఈ పనులు సాగిస్తున్న నారాయణపై కేసు నమోదు చేయాలి. వన్ సిటిజన్.. వన్ ఓట్ అనేది వైఎస్సార్సీపీ సిద్ధాంతం.’ అప్పిరెడ్డి డిమాండ్ చేసిన అంశాలపై ఈసీ స్పందించాల్సి ఉంది.
నారాయణ అంతే..
నారాయణ చంద్రబాబు మనిషి. మొదటి నుంచి తన విద్యాసంస్థలను ఎన్నికల సమయంలో బాబు కోసం ఉపయోగిస్తున్నారు. 2014లో ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలను ఆయన తీసుకుని ఆ పార్టీ కోసం ఖర్చు పెట్టారు. విద్యాసంస్థల సిబ్బందిని ఎన్నికల్లో ఉపయోగించారు. దీనికి రిటర్న్ గిఫ్ట్‌గా బాబు ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ అమరావతి కుంభకోణంలో కీలకపాత్ర పోషించారు. 2019లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక హైదరాబాద్‌లో ఉంటూ 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కుట్రలు పన్నారు. అందులో భాగంగానే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల సిబ్బంది కొందరిని ఎన్నికల పనులకు పెట్టుకున్నారు. వీళ్లే ఓటర్ల వివరాలు తెలుసుకుంటున్నారు. నెల్లూరులో అయితే ఎన్ టీం అని పెట్టి ప్రజల్లోకి పంపారు. ఇలా వెళ్లిన టీంకు నిరసన ఎదురైంది. ఓటీపీ చెప్పాలని అడినందుకు జనం చుక్కలు చూపించారు. గత ఎన్నికల్లో కూడా నారాయణ పాఠశాలల సిబ్బంది డబ్బు మూటలతో అధికారులకు దొరికిపోయారు.
పవన్ ఇప్పుడేమంటావ్..
పౌరుల వ్యక్తిగత డేటాను టీడీపీ మొదటి నుంచి తీసుకుంటోంది. 2014లో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సర్వే పేరిట వివరాలు తీసుకుని పార్టీ కోసం వినియోగించుకుంది. అయితే నేటి ప్రభుత్వం మంచి పని కోసం వివరాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుపట్టారు. ఆయనకు వాస్తవాలు తెలిసినా చంద్రబాబు కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉన్న వలంటీర్ల వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిఫలం పవన్‌కు దక్కింది కూడా. రగిలిపోయిన వలంటీర్లు ఆయన ఫ్లెక్సీకి చెప్పులతో సన్మానం చేశారు. ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల సిబ్బంది విద్యార్థుల సున్నిత సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో యువతులున్నారు. మరిప్పుడు కదా పవన్ స్పందించాల్సింది. అయితే ఆయన నోటి నుంచి మాట కూడా రావడం లేదు. ఎన్నికల్లో టీడీపీకి పెట్టుబడిదారైన నారాయణ మీద మాట్లాడేంత ధైర్యం జనసేనానికి లేదు. ఈ విషయంలో అజ్ఞాతవాసిగానే ఉంటాడు.