వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీని నాశనం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడి ఓటుకు నోటు ఆడియో విషయాన్ని జనం ఇంకా మర్చిపోకుండా దెప్పి పొడుస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రశాంతిరెడ్డి ఆడియో తోడైంది. పెద్ద మనుషులు కదా అని స్వాగతిస్తే పార్టీని డ్యామేజ్ చేసేలా ప్రవర్తించారని బహిరంగంగా వాపోతున్నారు.
మా పార్టీలో చేరండి. కోట్ల రూపాయలిస్తామని ప్రశాంతిరెడ్డి మాట్లాడిన ఆడియో బయటికి రావడంతో నెల్లూరు జిల్లా టీడీపీలో కలకలం రేగింది. పారిశ్రామికవేత్త అయిన వీపీఆర్ పార్టీకి బాగా ఉపయోగపడతాడు. ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడని భావిస్తే పార్టీ పరువును గంగలో కలిపేశాడని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు.
చంద్రబాబు.. నెల్లూరు జిల్లాలో పార్టీ మొత్తాన్ని వీపీఆర్ చేతిలో పెట్టేస్తే ఖర్చులన్నీ ఆయనే చూసుకుంటాడని భావించారు. కానీ దంపతులు అధికారికంగా చేరక ముందు నుంచే రాజకీయాలు మొదలుపెట్టారు. చేరాక జరిగిన పరిణామాలను చూసి నాయకులంతా వీరు ఇంత చేశారా అని ఆశ్చర్యపోతున్నారు. ‘సర్వేపల్లి వద్దని చెప్పాం. దగ్గరి బంధువైన సోమిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. చివరికి ఎవరూ లేకపోతే ఆయనకే ఇస్తారు కదా’ అని ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. ఇప్పుడిదే వేమిరెడ్డి మెడకు చుట్టుకుంది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సర్వేపల్లి సీటు ఇస్తే ఓడిపోతామని జిల్లాలోని ముఖ్య నాయకులంతా చంద్రబాబుకు చెప్పారు. ఆధిపత్యపోరులో భాగంగా నారాయణ అయితే సోమిరెడ్డికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రశాంతిరెడ్డి అక్కడి నుంచి పోటీ చేయనని తప్పుకొని ఆయనకు దారి కల్పించారని ఓ వర్గమంతా ఆగ్రహంగా ఉంది. ఆమె టికెట్ తీసుకుని ఉంటే సోమిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయేదని, కానీ బంధుప్రీతితో పార్టీని ఓటమి దిశగా తీసుకెళ్లారని వాపోతున్నారు.
ఇక పోలంరెడ్డి దినేష్రెడ్డికైతే చంద్రబాబు పెద్ద కత్తితోనే వెన్నుపోటు పొడిచారు. దినేష్ టీడీపీ ఇన్చార్జిగా కోవూరు నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. కానీ బాబు వీపీఆర్ భార్యకు సర్వేపల్లి కాదంటే కోవూరు తీసుకోండి. అంతా మీ ఇష్టమని చెప్పడాన్ని చూస్తే దినేష్‌కు టికెట్ ఆశ చూసి వాడుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డికి ఓడిపోతాడని ప్రశాంతిరెడ్డి అన్నారు. అసలు ఆనం అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. వెంకటగిరి టికెట్ అడిగారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చంద్రబాబు తరఫున మంత్రాంగం నడిపి ఆత్మకూరు నుంచే పోటీ చేసేలా ఒప్పించారు. రామనారాయణరెడ్డి ఓడిపోతాడని తెలిసే సీటు ఇప్పించారని ఆనం మనుషులు కోపంతో రగిలిపోతున్నారు.
ఆడియో వల్ల టీడీపీ నాయకులకు అనేక విషయాలపై స్పష్టత వచ్చేసింది. చంద్రబాబు భారీగా డబ్బు తీసుకుని వేమిరెడ్డికి పార్టీ పెత్తనం ఇచ్చేశారని అర్థమైపోయింది. చాలాకాలంగా నమ్ముకుని ఉన్న వారిని కాదని, ఆ దంపతులు చెప్పినట్లుగా టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక మాజీ మంత్రి, సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ అయితే పార్టీ అంతా నాదే అనుకుంటే బాబు వీపీఆర్‌కు అవకాశమిచ్చారని సన్నిహితుల వద్ద బాధపడిపోతున్నారు. ఒక్క ఆడియో క్లిప్పింగ్ జిల్లాలో టీడీపీని కుదిపేసింది. నేతలందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకునే పరిస్థితులు వచ్చేశాయి.
చంద్రబాబు, వేమిరెడ్డి దంపతులు అన్యాయం చేశారని తెలియడంతో ఇప్పుడు దినేష్‌రెడ్డి స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓడిపోయే సీటును అంటగట్టిన నేపథ్యంలో ఆనం ఏమంటారో తెలియాల్సి ఉంది. కోవూరులో గెలుపు కోసం డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తూ వేమిరెడ్డి దంపతులు నీతి తప్పారని తెలుగు తమ్ముళ్లే ఆగ్రహంగా ఉన్నారు.