అనగనగా ఓ సినిమా.. అందులో మోహన్‌బాబు ఆకు రౌడీ. నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు.. అంటూ అసిస్టెంట్‌తో చాలాసార్లు అంటాడు. ఓ సీన్లో మోహన్‌బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి వదిలేస్తారని అసిస్టెంట్ చెబుతాడు. అందుకు మోహన్‌బాబు నాకు వాళ్లు తెలుసు.. కానీ నేనే వాళ్లకు తెలియదు అనేసి పోలీస్ జీపు ఎక్కుతాడు. ఇదే సీన్ నిజ జీవితంలో ఒకరికి కనెక్ట్ అవుతుంది.
రాసి పెట్టుకోండి నరసాపురం సీటు నాదే.. నా బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు. కేంద్ర పెద్దలంతా తెలుసు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమక్షంలోనే చెబుతున్నా.. అక్కడి నుంచే పోటీ చేస్తానని మీసాలు తిప్పాడు రఘురామకృష్ణరాజు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అందరూ ఆనాడే అనుకున్నారు. చివరికి అతను ఆ సినిమాలో మోహన్‌బాబు లాంటోడే అని తేలింది. నరసాపురం సీటును బీజేపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించడంతో రఘురామ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద పడి ఏడ్చారు. ఆయన, సోము వీర్రాజు వల్ల టికెట్ రాలేదని ఆరోపించారు. మూడడుగులు వెనక్కి వేస్తున్నానని చెప్పారు. కానీ 30 అడుగులు వెనక్కి వేసినా ఏమీ కాదని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది.
రఘురామ 2019లో వైఎస్సార్సీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. 2014లో చంద్రబాబు ఇతడిని హడావుడిగా టీడీపీ నుంచి బీజేపీలో చేర్పించారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ సీటు ఇప్పించాలని ప్రయత్నించారు. కానీ కమలం పెద్దలు వారి పన్నాగం పసిగట్టి గోకరాజుకు అవకాశం ఇచ్చారు. 19లో బాబు పట్టించుకోకపోతే జగన్ సీటు ఇచ్చి గెలిపించారు. కానీ రఘురామ మళ్లీ నారా వారి పంచనే చేరారు. టీడీపీ కోసం పనిచేస్తూ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బాబు డైరెక్షన్లో కోర్టులో పిల్స్ వేస్తూ ఇబ్బంది పెట్టాలని చూశారు. ఎల్లో మీడియా డిబేట్లకు వెళ్లి నోరు పారేసుకున్నారు.
రఘురామ నిత్యం రెడ్డి సామాజిక వర్గాన్ని పచ్చ మాఫియాను పొగుడుతూ గడిపాడు. కేంద్రంతో తనకు బాగా సంబంధాలున్నాయని బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా వారి వెంటే తిరిగాడు. కానీ టికెట్ మాత్రం బీజేపీ దగ్గర తీసుకోవాలని వాళ్లంతా చేతులెత్తేశారు. బాబు బెయిల్ కోసం లోకేశ్ ఢిల్లీలో ఉంది రఘురామ ఇంట్లోనే. పవన్‌ది కూడా అదే పరిస్థితి. కానీ వాళ్లెవరూ టికెట్ విషయంలో సాయం చేయలేదు.
దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణను హీరోగా పెట్టి సినిమా తీస్తానని మహేష్‌బాబు వాడినట్లు రఘురామను చంద్రబాబు గ్యాంగ్ వాడేసింది. లాస్ట్‌కి హ్యాండ్ ఇచ్చింది. టికెట్ల విషయం వచ్చే సరికి బాబు తెలివిగా నరసాపురాన్ని బీజేపీకి కేటాయించేశారు. వాళ్లు అతనికి అవకాశం ఇవ్వరని ఆయనకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదని, దీనికి కారణం జగన్ అని ఎల్లో మీడియా కట్టుకథలు చెబుతోంది. అంటే ఎన్నికలయ్యే వరకు రఘురామను వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నారు.
నరసాపురం అభ్యర్థి శ్రీనివాసవర్మ 20 ఏళ్లుగా బీజేపీలోనే ఉన్నారు. 2009లోనే అదే స్థానం నుంచి పోటీ చేశారు. విధేయత ప్రాతిపదికన ఈసారి టికెట్ ఇచ్చారు. ఇక రఘురామ చరిత్ర చూస్తే బాబు కళ్లలో ఆనందం కోసం ఐదేళ్లు తీవ్రంగా కృషి చేశారు. కానీ చివరికి బిల్డప్ రాజుగా మిగిలిపోయాడు. దీంతో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. ముంతమామిడి పండన్నాడే గంగరాజు.. అనే పాటందుకుంది.