తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరుపున జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించిన రోజు నుండి ఈరోజు వరకు చెలరేగిన మంటలు ఏదొక రూపంలో రగులుతూనే వున్నాయి. మొదట టీడీపీ నాయకులు మేమే పోటీ అంటూ ప్రకటించి గొడవలు చేశారు. తీరా జనసేన నుండి అరని శ్రీనివాసులకు టికెట్ ఇవ్వగానే జనసేన లోని కీలక నేతలు మేము సహకరించే పరిస్థితులు లేవు అని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని గొడవ గొడవ చేశారు. తరువాత పార్టీ పెద్దల సూచనతో సగం మంది నాయకులు సరే అని చెప్పినా ప్రచారంలో మాత్రం అంటీ ముట్టనట్టు తిరుగుతున్నారు. ఇప్పుడు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ జన సేన పార్టీలో నెలకొన్న సమస్యలను సర్ధిచెప్పడానికి తిరుపతి రానున్నారు అని తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ వచ్చిన తరవాత అయిన కనీసం కూటమిలో కాకపోయిన జన సేన పార్టీ లో ఏకాభిప్రాయం వస్తుంది ఏమో అని చూడాలి.
దీనితో పాటు జనసేన, బిజెపి నాయకులు కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీద ఫిర్యాధు చేసి భూమన్ కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా దించమని కోరారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురి అవుతున్నారు. దాదాపు ముప్పై సంవత్సరాల పోరాటాల తరువాత దాదాపు తొమ్మిది వేల మందికి ఇళ్ళ పట్టాలు వచ్చాయి, అలాగే వేద పాఠశాలలు, శిల్ప కళాశాల, పారిశుద్ధ్య, పోటు ఇలా వివిధ రంగాలకు చెందిన ఆరు వేల మందికి జీతాలు పెరిగాయి. వారితో పాటు మిగిలిన తొమ్మిది వేల ఐదు వందలు మందికి కూడా జీతాలు 3000 నుండి 20000 వరకు పెరిగాయి. అలాగే 1500 కోట్లతో తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో రోడ్లు వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.ఇప్పుడు జన సేన, బిజెపి నాయకుల ఫిర్యాధు తో భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా తొలగిస్తే అభివృద్ది పనులు అలాగే ఇళ్ల పట్టాలు, జీతాలు పెంపు అన్ని ఆగిపోతాయి అని కలవరపడుతున్నారు.
టీటీడీ లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా క్యాంటీన్ లో తక్కువకి టీ, టిఫిన్, భోజనం అందించే నిర్ణయాలు భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు ఇప్పుడు ఈ బిజెపి, జన సేన కలసి మా పొట్ట మీద కొడుతున్నారు అని టీటీడీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా టీడీపీ నాయకులు జన సేన అభ్యర్థి కి సపోర్ట్ చెయ్యడం లేదు ఇప్పుడు కొత్తగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఫిర్యాదులు చేసి జన సేన, బిజెపి తమ ఒంటెద్దు పోకడలతో ప్రజల నుండి, టీటీడీ ఉద్యోగుల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగొట్టుకుంటున్నారు.