ఇరుకు వీధుల్లో పెట్టే రోడ్ షోలకు కూడా జన సమీకరణ చేయలేక చేతులెత్తేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులు. దీంతో అధినేత చంద్రబాబు నాయుడి పరువు గంగలో కలిసిపోతోంది. తాజాగా కృష్ణా జిల్లా పామర్రులో ప్రజాగళం రోడ్ షోకు ఏర్పాట్లు చేశారు. అయితే జనం లేరనే విషయం తెలుసుకున్న బాబు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
షెడ్యూల్ చూస్తే ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సత్తెనపల్లి నుంచి పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు రావాలి. సాయంత్రం 4 గంటలకు పామర్రు మెయిన్ రోడ్డు మీదుగాగా నాలుగు రోడ్ల జంక్షన్ వరకు రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహిస్తాంచాలి. కానీ జనం లేరన్న విషయం నారా వారి చెవిన పడడంతో షెడ్యూల్ టైమ్ కంటే రెండు గంటలు ఆలస్యంగా పామర్రుకు చేరుకున్నారు. అలాగే హెలీప్యాడ్ వద్ద బస్సులోనే ఉండిపోయారు. అభ్యర్థి వర్ల కుమార్ రాజా, నేతలపై బాబు ఫైరయ్యారు. జనసమీకరణ చేయడం చేత కాదా అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇటీవల కావలిలో కూడా ఇలాగే జరిగింది. రోడ్ షోకు జనాన్ని రప్పించడంలో అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. రెండు గంటలకు పైగా బస్సులోనే ఉండి నేతలకు క్లాస్ తీసుకున్నారు. ప్రజల సంగతి పక్కన పెడితే అసలు రోడ్ షోలు, సభలకు నాయకులు, కార్యకర్తలే డుమ్మా కొట్టేస్తున్నారు. బాబు ప్రసంగాలు వినలేక ఎవరూ రావడం లేదనే చర్చ పార్టీలో నడుస్తోంది. ముందుగా సమావేశాలు పెట్టి జనసమీకరణ చేయాలని ముఖ్యమైన వారికి బాధ్యతలు అప్పగిస్తున్నా తమకేం పట్టనట్లు ఉంటున్నారు. దీంతో ప్రజాగళం మూగబోతోంది.