ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి గందరగోళంగా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య వివాదాలు ఆగడం లేదు.. జిల్లాల నుంచి రోజూ అధిష్టానానికి సమస్యలు వస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో నాయకులు రచ్చకెక్కి పార్టీ పరువు తీస్తున్నారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు.
– తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఇటీవల ఫ్లెక్సీల లొల్లి జరిగింది. మాజీ మంత్రి జవహర్‌పై అచ్చిబాబు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం పెట్టిమరీ కోపాన్ని ప్రదర్శించారు. జవహర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. జవహర్, అచ్చిబాబు వర్గాల నడుమ ఎనిదేళ్లుగా గొడవలున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు ఇదేం దుస్థితి అంటూ తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో జవహర్‌ను తిరువూరుకు పంపగా ఆయన ఓడిపోయారు. మళ్లీ కొవ్వూరుపై దృష్టి పెట్టారు. ఇది అచ్చిబాబుకు నచ్చలేదు.
– గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో జనసేన, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్ జరిగింది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కాస్తా ఘర్షణకు దారి తీసింది. సోమవారం రా కదలిరా సభ జరుగుతుంది. ఇందులో భాగంగా నారా కోడూరు కూడలిలో చంద్రబాబుకు ఫెక్సీలు ఏర్పాటు చేస్తుండగా జనసేన నాయకులు ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆ సెంటర్లో పవన్, ఇతర నాయకుల ఫెక్సీలు పెట్టేందుకు తెలుగుదేశం నాయకులు అంగీకరించలేదు. బాబు సామాజిక వర్గానికి చెందిన వారివి మాత్రమే ఉండాలని, వేరేవాళ్ల ఫ్లెక్సీలు పెడితే సహించేది లేదని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపేశారు. ఇరువర్గాలు బాబుకు ఫిర్యాదు చేయాలని ఎదురుచూస్తున్నాయి.
– బాపట్ల తెలుగుదేశం కార్యాలయంలో ఐ టీడీపీ, పార్టీ పట్టణ విభాగం నాయకులు బాహాబాహీకి దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ రాయలేని భాషలో తిట్టుకున్నారు. విడిపోయి సవాళ్లు చేసుకున్నారు. బాపట్ల మండలంలోని రెండో క్లస్టర్ నాయకులతో ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి ‘ఇన్నాళ్లు ఎక్కడున్నారు?, ఐ టీడీపీ గ్రౌండ్ లెవల్లో ఎక్కడా కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మానం కోపోద్రిక్తుడై గొలపల పైకి దూసుకెళ్లారు. ఇది కాస్తా పార్టీలోని కమ్మ, యాదవ సామాజిక వర్గాల మధ్య గొడవగా మారిపోయింది. కమ్మ కులానికి చెందిన మానం యాదవ కులస్తుడైన గొలపలపై దాడి చేయడంతో బీసీలు భగ్గుమంటున్నారు. పార్టీలో బీసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.
– మండపేట సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీ, జనసేనలో ముసలం పుట్టించాయి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని బాబు అన్నారు. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం రగిలిపోయింది. రాజమహేంద్రవరంలో సమావేశం నిర్వహించి బహిరంగంగానే అసంతృప్తి తెలిపారు. తమను సంప్రదించకుండా జోగేశ్వరరావు పేరు ప్రకటించడం దారుణమన్నారు. జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ బాబు ప్రకటనపై మండిపడ్డారు. టీడీపీ కార్యక్రమాలకు వెళ్లొద్దని ఆయన తన వర్గీయులకు చెప్పినట్లు తెలిసింది.
– విశాఖ పశ్చిమ టికెట్ గణబాబుకు ఇవ్వొదంటూ టీడీపీ నేతలే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గణబాబుపై వ్యతిరేకత చూపించారు. ఇతను ప్రజా సమస్యలపై పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై గౌరవం చూపలేదన్నారు. ఆయన అరెస్ట్‌పై ఆందోళన చేయలేదని, కార్యకర్తలను పట్టించుకోని వ్యక్తికి టికెట్ ఇస్తే సహించేది లేదని ప్రకటించారు. ఇలా ప్రతిచోట నాయకుల మధ్య గొడవలు, బహిరంగ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.