ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అభ్యర్థుల మార్పు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారు రాగా, పలువురు ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగింది. విజయమే లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారని కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు శ్రీమతి కటారి అరవిందా యాదవ్ నియమితులయ్యారు.
పొత్తులు కుదరక, టికెట్లు ప్రకటించలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆపసోపాలు పడుతుంటే జగన్ మాత్రం వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తున్నారు. ఎన్నికల కోసం ఇప్పటికే జిల్లాలకు కో-ఆర్డినేటర్లను నియమించారు. వారు నియోజకవర్గాల్లో నేతలతో సమావేశమవుతూ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు ఇవ్వలేని పక్షంలో మరో రూపంలో న్యాయం చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. ఇటీవల కొత్తగా సమన్వయకర్తలుగా నియమితులైన వారు ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇది సమయంలో ప్రతిపక్ష పార్టీలో అసలు అభ్యర్థులు ఎవరో తెలియక గందరగోళం నెలకొంది.