సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు భారీగా డబ్బు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పనులను చంద్రబాబు నాయుడు కొందరు ముఖ్య నాయకులకు అప్పగించినట్లు సమాచారం. ఆ పార్టీ ప్రధాన ఆర్థిక స్తంభాల్లో ఒకరైన మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఇన్చార్జి పొంగూరు నారాయణ ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లు తెలుగు తమ్ముళ్లలో ప్రచారం జరుగుతోంది.
నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో రాక ముందు ఎన్నికల్లో చంద్రబాబుకు డబ్బు సమకూర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2014లో గిఫ్ట్ కింద మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాక అమరావతి భూ కుంభకోణంలో బాబుతో కలిసి కీలకపాత్ర పోషించారు. రూ.కోట్లను దోచుకున్నారని విమర్శలున్నాయి. కోర్టులో కేసులు నడుతుస్తున్నాయి. దీంతో ఒక్క నెల్లూరే కాకుండా మరో మూడు, నాలుగు జిల్లాలకు డబ్బు సర్దుబాటు చేయాల్సిన బాధ్యతను టీడీపీ అధినేత నారాయణకు అప్పగించారని తెలిసింది.
నారాయణకు దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఏర్పాటు చేశారు. డబ్బు కోసం తన సంస్థల్లోని సిబ్బందిని ఆయన వినియోగించుకుంటున్నారని సమాచారం. కొద్దిరోజులుగా నెల్లూరు నగరంలోని బంగారు, ఇతర బడా వ్యాపారుల నుంచి అప్పుల రూపంలో నగదు తీసుకుని ఒకచోట చేరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వ్యాపారులు రోజూ డబ్బును మెడికల్ కాలేజీకి తెచ్చి నారాయణ మనుషులకు ఇస్తున్నారని చెబుతున్నారు. టీడీపీ నాయకులపై నమ్మకం లేక పూర్తిగా తన వాళ్లతోనే డబ్బు సేకరించి దాచుతున్నట్లు తెలిసింది. పైగా ఈసారి నారాయణే సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో అనిల్ చేతిలో ఓడిపోయారు. 24లో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకుని ఎన్ టీమ్‌ను పెట్టి పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. వార్డుల్లో కార్యాలయాలు తెరిచి యువతను ప్రలోభపెట్టి వెంట తిప్పుకొంటున్నారు. సిటీ స్థానంలో రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
వయసు రీత్యా చూస్తే చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికలు చాలా కీలకం. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ఉంది. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి గడపను తాకింది. దీంతో బాబు గెలుపు కోసం డబ్బుపై అధికంగా ఆధారపడ్డారు. ఆయన ఆదేశాలతో నెల్లూరు నుంచి ఇతర జిల్లాలకు నగదు తరలిచేందుకు నారాయణ ఏర్పాట్లు చేస్తున్నారని కొందరు టీడీపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. అప్పుల రూపంలో తెస్తున్న నగదును ఆయన సిబ్బంది విద్యాసంస్థల్లో దాచి పెడుతున్నారని ప్రచారం ఉంది.
తనిఖీలు
ఇదిలా ఉండగా శుక్రవారం నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో అధికారులు తనిఖీలు చేశారు. డబ్బు విషయమై వెతుకుతున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే నిషేధిత మందులు విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేసినట్లు తేలింది. కాలేజీ మేనేజర్, నారాయణ భార్య అనుమతి తీసుకుని అధికారులు అన్ని చోట్ల క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పలువురు మెడికోలు మత్తు మందులు వాడుతున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ దిశగా కూడా ఆరా తీసినట్లు చెబుతున్నారు.