నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్)కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనకు ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేదు. కేంద్రంలో ఆయనకున్న నెట్వర్క్ ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ ముగ్గురూ ట్రిపుల్ ఇంజిన్ లాంటి వాళ్లు. తప్పకుండా ప్రభంజనం సృష్టిస్తారు’ నెల్లూరులో యువతతో నిర్వహించిన ముఖాముఖిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాటలివి. వారిని ప్రజలకు పరిచయం చేస్తూ పొగడ్తలతో ముంచెత్తాడు. వాస్తవానికి వాళ్లు ఎంతటి దుర్మార్గులో ఆయనకు తెలియంది కాదు.
వీపీఆర్‌ను ఢిల్లీలో లాబీయింగ్ కోసం జగన్ రాజ్యసభకు పంపాడని కొన్నేళ్లపాటు టీడీపీ గగ్గోలు పెట్టింది. హైకోర్టు జడ్జికి రూ.2 కోట్ల విలువైన డైమండ్ వాచ్‌ను జగన్ తరఫున వేమిరెడ్డి తీసుకెళ్లాడని గతంలో ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేసింది. వీపీఆర్ సమాజానికి పట్టిన చీడపురుగని, పారిశ్రామికవేత్త ముసుగులో బ్రోకర్ పనులు చేస్తున్న అతనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ కూడా అనేక సందర్భాల్లో తిట్టిపోశారు. అలాంటి వ్యక్తిపై చినబాబు నేడు పొగడ్తల వర్షం కురిపించాడు. ఆయనకు పెద్ద ఫ్యాన్ అన్నాడు.
నారాయణ.. విద్యను వ్యాపారమయం చేసిన ఘనుడు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా లీడర్. టీడీపీకి ఆర్థిక వనరులు సమకూర్చి ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి పేదలను చదువుకు దూరం చేసిన ఈయన లోకేశ్ దృష్టిలో చాలా మంచోడు. 2014 – 19 మధ్య టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన నారాయణ నెల్లూరు నగరాన్ని నాశనం చేసింది నిజం. భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి ప్రాజెక్టు పేరుతో కార్పొరేషన్‌ను అప్పుల్లోకి నెట్టేశాడు. ఊరంతా తవ్వేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్లు పూర్తిగా వేయించింది. అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబుకు సహకరించి జిల్లా పరువు తీశాడు నారాయణ. తమ్ముడి భార్యపైనే కన్ను వేసి ఆమె కోరిక తీర్చలేదని పిచ్చిదానిలా ముద్ర వేశాడు.
ఇక శ్రీధర్‌రెడ్డి. రౌడీయిజం చేయడంలో దిట్ట. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు. బెదిరింపులకు పాల్పడడం.. చెప్పుకొంటూపోతే చాలా ఉన్నాయి. పద్ధతి మార్చుకోవాలని జగన్ పలుమార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో టికెట్ ఇవ్వనని నిరాకరించాడు. దిక్కులేక టీడీపీలో చేరాడు. మాకు రౌడీలే కావాలని వాళ్లు తీసుకున్నారు. శ్రీధర్‌రెడ్డిపై గతంలో అనేకమార్లు ట్వీట్లు చేసిన లోకేశ్‌కు ఇప్పుడు ఆయన పుణ్య పురుషుడిగా కనిపించడం ఏంటో.. ఈ ముగ్గురు ట్రిపుల్ ఇంజిన్ లాంటివారట. గెలిపిస్తే అభివృద్ధి చేస్తారట. జనం చెవలో పూలు ఏమైనా కనిపిస్తున్నాయా చినబాబూ.. అధికారం దక్కితే వేమిరెడ్డి ఇంకో నాలుగు మైనింగ్ ప్రాజెక్టులు తీసుకుని అడ్రస్ లేకుండాపోతాడు. నారాయణ ఉన్న ప్రభుత్వ బడులను మూయించేసి కార్పొరేట్వి మాత్రమే ఉండేలా చేస్తాడు. శ్రీధర్‌రెడ్డి ప్రతి ఇంటి ముందు ఈ స్థలం నాదని బోర్డు పెట్టేస్తాడు. వాళ్లు ఎంత మంచివారో నీకు కూడా తెలుసు. కాకపోతే నువ్వు పెద్ద ఇది కాబట్టి వెనుకేసుకొచ్చావ్.