తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావ సభల్లో ఇష్టమొచ్చింది మాట్లాడేస్తూ జనంలో చులకన అవుతున్నారు. తనకు సబ్జెక్టు లేదనే విషయాన్ని పదే పదే నిరూపించుకుంటున్నారు. టీడీపీకి మొదటి నుంచి సినీ గ్లామర్ ఎక్కువ. లోకేశ్ మామ నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆ పార్టీలో ఉన్నారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా వారితో పొత్తులో ఉన్నారు. అయితే లోకేశ్ మాత్రం జగన్‌కు సినిమాల పిచ్చి ఎక్కువైందని వ్యాఖ్యానించారు. సాలూరులో జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. యాత్ర-2లో జగనే నటిస్తే ఆ సినిమా కాస్త హిట్ అయ్యేదేమో?. దాని దర్శకుడికి రెండెకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారని ఆరోపించారు.
యాత్ర, వ్యూహం సినిమా పేర్లు చెబితే లోకేశ్ భయపడుతున్న పరిస్థితి ఉంది కాబోలు పదేపదే తలుచుకుంటున్నాడు. యాత్రపై దుష్ర్పచారం చేశారు. తెలంగాణలో కోర్టుకి వెళ్లి వ్యూహం సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నించారు.
టీడీపీకి సపోర్టుగా నిర్మాత చలసాని అశ్వినీదత్, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీమోహన్ తదితరులున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వారు హైదరాబాద్‌లో పేదల పొట్ట కొట్టి రియల్ ఎస్టేట్ చేసి బాగా గడించారు. అమరావతిలో కూడా పలువురికి భూములు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. ఆనాడు వైజాగ్‌లో స్టూడియోల కోసమంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రెండు ఎకరాల భూములు రాయలసీమలో స్టూడియో కట్టేందుకని యాత్ర డైరెక్టర్ మహీ చెబుతున్నా లోకేశ్, తెలుగు తమ్ముళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. అసలు సినిమా పిచ్చి ఉంది చంద్రబాబు, లోకేశ్‌కు.. ప్రతిసారి ఎన్నికల సమయంలో నటుల్ని ఉపయోగించుకునేది వారే.. షార్ట్ ఫిలిమ్స్ చేయిస్తుంటారు.
తమ ఎదుగుదలకు సినిమాలను వారి లాగా ఎవరూ వాడుకోరు. బాలకృష్ణ సినిమాల్లో చంద్రబాబును గొప్ప విజనరీ అంటూ పొగిడిస్తుంటారు. ఇతర పార్టీల నాయకుల్ని తిట్టేలా పొలిటికల్ డైలాగ్‌లు రాయించి పైశాచిక ఆనందం పొందుతుంటారు. రాయలసీమపై విషం కక్కే దర్శక, నిర్మాతలకు అండగా ఉండేది వాళ్లే.. సినిమాల్లో మా సామాజిక వర్గం డామినేషన్ ఉండాలని మిగిలిన వర్గాలను తొక్కేది ఎవరో అందరికీ తెలుసు. తాజాగా రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి అబద్ధాలను ప్రచారం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అనేదేమో జగన్‌ను.
జగన్ సినీ పరిశ్రమకు ఎంతో అండగా నిలిచారు. కరోనా సమయంలో అనేక రాయితీలు ప్రకటించారు. చిన్న సినిమా బతికేందుకు చర్యలు తీసుకున్నారు. అందుకే ఆయనపై చాలామంది నటులకు మంచి అభిప్రాయం ఉంది. హీరోలే స్వయానా అభినందించారు. చంద్రబాబు మాత్రం సినీ రంగంలో పెద్దమనుషులుగా చెలమణీ అవుతున్న పెత్తందారులకు సపోర్టుగా ఉన్నారు. బాలకృష్ణ యాక్షన్ సినిమాలు కూడా నవ్వు తెప్పిస్తుంటాయి. ఎలాగూ లోకేశ్‌కు నటించాలని కోరిక ఉన్నట్లు ప్రచారం ఉంది. అందుకే తన మామ పక్కన యాక్ట్ చేస్తే జనం ఇద్దరినీ చూసి ఎక్కువగా నవ్వుకుంటారు. కాస్త ఆలోచించు చినబాబూ..