చేతిలో కాగితం పెన్ను ఉంది కదా అని బహిరంగ లేఖలు పేరున అబద్ధాలు,అభూత కల్పనలు రాయడం ఈ మధ్య ప్రతిపక్షానికి నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అధికారం కోసం అర్రులు చాచుతూ ఈ విధమైన బురదజల్లే కార్యక్రమాన్ని భుజాన వేసుకునట్టు కనిపిస్తుంది. తమ పాలనలో , తామ పార్టీ నేతల అండదండలతో జరిగిన అవకతవకలను ప్రజలు మరిచిపోయారనే ఆలోచనతో, అదే అవకతవకలకి సంబంధించి తమ పార్టీనే నేడు పోరాడుతున్నట్టు భ్రమలు కల్పించే విధంగా బహిరంగ లేఖల డ్రామాలకి తెరతీసింది.
రైతు రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిన నారా లోకేశ్ కొన్ని నెలల క్రితం రైతు సమస్యలు అంటూ అబద్ధాలతో లేఖ రాసి అభాసుపాలైన విషయం మర్చిపోక ముందే నిన్నటిరోజున తమ పాలనలో తమ పార్టీ నేతల కనుసన్నల్లో జరిగిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై ముసలికన్నీరు కారుస్తూ, రెండు రోజుల క్రితం రామోజీ ఈనాడు పత్రికలో అచ్చువేసిన అసత్యాలనే మరోసారి లేఖగా రాసారు. ఆ లేఖలో జగన్ అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒక్కరికైనా న్యాయం చేసారా ? తమ పార్టీనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసింది అంటూ పచ్చి అబద్ధాలను లేఖలో రాసుకొచ్చారు.
అసలు అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే, ఈ స్కాం వెనుక ఉన్నది తెలుగుదేశం పెద్దలే అన్నది ఎవరు కాదనలేని నిజం, కుంభకోణం సాకుగా చూపి అగ్రిగోల్డ్‌కు చెందిన అమరావతిలోని అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఆ సంస్థ నుంచి చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేశ్ పన్నాగాలు పన్నారు అన్నది వాస్తవం.
2018 నవంబర్ 24న అనంతపురంలో సీఎం హోదాలో పర్యటిస్తున్న సందర్భంలో చంద్రబాబును కలిసేందుకు అగ్రిగోల్డ్ బాధితులు వచ్చారు. ఆ సమయంలో తమ బాధను చెబుతూ వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన అగ్రిగోల్డ్ బాధితుల ప్రతినిధి సిద్ధేశ్వర్ ను చంద్రబాబు అందరి ముందు చేయి చేసుకున్నారు.
అగ్రిగోల్డ్ బాధితులు ప్రాణాలు తీసుకుంటుంటే “అగ్రిగోల్డ్ సమస్య కంటే ప్రధానమైనవి ఉన్నాయి. అందుకే మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై చర్చించలేదని” 2018 డిసెంబర్ లో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఓ విలేకరి ప్రశ్నకు నాటి టీడీపీ నాయకుడు మంత్రి కాల్వ శ్రీనివాసులు జవాబు ఇచ్చారు.
అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్మోహన్రావు 2016 ఏప్రిల్ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాలు కొనడం గమనార్హం.
300 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు ఎంతో కొంత ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా విదల్చలేదు. బాధితులు మూడున్నరేళ్లపాటు పోరాటం చేసినప్పటికీ టీడీపీ ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. ఒక పక్క అగ్రిగోల్డ్ కుంభకోణంలో భాగస్వామ్యులై మరోపక్క బాధితుల పక్షాన ఉన్నాం అంటూ నటిస్తూ వచ్చారు. పోరాడుతున్న బాధితుల దగ్గరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని పంపి అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమి లేదని చెప్పించి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
టీడీపీ పాలనలో అడుగడుగునా అగ్రిగోల్డ్ విషయంలో అవినీతికి పాల్పడ్డ తెలుగుదేశం నేడు వారి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నట్టు మరో కొత్త నాటకానికి తెరలేపింది. జగన్ గారు ప్రతిపక్షనేతగా అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరిగే విధంగా చేస్తాను అని హామీ ఇచ్చిన విధంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వారికి మేలు జరిగే విధంగా అడుగులు వేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు రెండు దశల్లో 929.75 కోట్లు చెల్లించారు. 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు. రాష్ట్రంలో 11,57,497 మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో రూ.3,944.70కోట్లు డిపాజిట్ చేశారు. వారిలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 10వేలు లోపు డిపాజిట్ చేసినవారికి మొదటి విడతలో, రూ.20వేలు లోపు డిపాజిట్ చేసినవారికి రెండో విడతలో ప్రభుత్వం వారి డిపాజిట్ మొత్తాలను చెల్లించింది.
మిగిలిన వారికి కూడా డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాలు అడ్డంకిగా మారాయి.సీఐడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ కూడా తరువాత అటాచ్ చేయడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. సీఐడీ అటాచ్ చేసిన ఆ సంస్థ భూములను వేలం ద్వారా విక్రయించి, బాధితులకు చెల్లించడానికి వేగంగా చర్యలు చేపట్టింది.
అందుకోసం ఏలూరు ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ అటాచ్ చేసిన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఆస్తులు వేలం వేసి మిగిలిన బాధితులకు డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
అగ్రిగోల్డ్ స్కాం ని ఆసరాగా తీసుకుని భూములు మింగేయటానికి తెలుగుదేశం చూస్తే , ఓ ప్రైవేటు సంస్థ డిపాజిటర్లను మోసం చేస్తే బాధితులను ఆదుకున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సీఎం జగన్ గారు మాత్రమే చేసి చూపించారు. దేశంలోని మిగతా ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల వేల జగన్ గారు చేసిన మంచి ప్రచారంలోకి వచ్చేలా చంద్రబాబు చేసిన చెడు ప్రజలకు మరింతగా గుర్తుకు వచ్చేలా లోకేశ్ లేఖలు రాసి మరీ గుర్తు చేయడం తమ పార్టీకే ఇబ్బందిగా మారుతుందని టీడీపీలోనే కొంతమంది మాట్లాడుకోవడం చూస్తే భవిష్యత్ టీడీపీ అధినాయకుడుగా చూపిస్తున్న నారా లోకేష్ రాజకీయ పరిపక్వత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.