‘వావ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ అన్ని రికార్డులు బద్ధలు కొట్టిందని విన్నాను. 277 ఎలా కొట్టారో హైలెట్స్‌లో చూస్తా’ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ట్వీట్ ఇది. దీనిని చూసిన తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. రాష్ట్రమంతా ఎన్నికల గోలలో ఉంటే మీరు క్రికెట్‌పై దృష్టి పెట్టారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకేశ్‌కు రాష్ట్రస్థాయిలో ఎన్నికల బాధ్యతలు అప్పగించకుండా చంద్రబాబు నాయుడు దూరం పెట్టారని పార్టీలో ప్రచారం ఉంది. కుమారుడి వల్ల ఉపయోగం లేకపోగా డ్యామేజీ ఎక్కువ జరుగుతుందని భయపడిన బాబు ఆయన్ను కేవలం మంగళగిరికే పరిమితం చేశారు. యువగళం పాదయాత్ర పూర్తయ్యాక లోకేశ్ చాలారోజులు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. నారా వారు పవన్ కళ్యాణ్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతో అలిగి బయటకు రాలేదని చెబుతారు. చినబాబుకేమో రాష్ట్రమంతా తిరిగి టీడీపీ తరఫున ప్రచారం చేయాలని కోరిక ఉంది. అందుకు బాబు ఒప్పుకోలేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగిందని తెలుగు తమ్ముళ్లు అంటున్న మాట.
ఈ నేపథ్యంలో పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో బాబు ప్రచారానికి సరేనన్నారు. దీంతో లోకేశ్ శంఖారావం పేరుతో యాత్ర చేపట్టారు. అయితే అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నాయకులు, కార్యకర్తలే పట్టించుకోలేదు. దీనికితోడు ప్రసంగాలు నవ్వులపాలయ్యాయి. అప్పటికే రెడ్‌బుక్ పేరుతో హంగామా చేసిన తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఈ కారణాలతోనే ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో కొడుకు పాత్రను చంద్రబాబు పరిమితం చేశారు.
బాబు ప్రజాగళం పేరుతో బుధవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి లోకేశ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి ఉంది. కానీ నారా వారు వద్దని వారించి మంగళగిరికే వరకే చూసుకోవాలని ఆదేశించారు. ఈసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం చినబాబుకు ఇష్టం లేదట. టీడీపీకి బాగా పట్టున్న సేఫ్ ప్లేస్‌కు వెళ్లాలని భావించారని, అయితే తండ్రి ఒత్తిడికి తలొగ్గి ఒప్పుకొన్నారని ప్రచారం ఉంది. దీంతో అయిష్టంగానే మంగళగిరిలో తిరుగుతున్నట్లు చెబుతున్నారు. జనంలోకి వస్తే సమాధానం చెప్పలేననే భయంతో అపార్ట్మెంట్లలో పెత్తందారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తన సామాజికవర్గం వారిపైనే ఆధారపడ్డారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్య పేదలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుని అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు.
మరోవైపు పవన్‌తో కలిసి బాబు కొన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం లోకేశ్‌కు బాగా కోపం తెప్పించినట్లు తెలిసింది. బీసీ మహిళ అయిన లావణ్యకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడం.. తదితర కారణాలతో చేతులెత్తేసి నామమాత్రంగా మంగళగిరిలో ప్రచారం చేసి తనకు నచ్చిన పనులు చేస్తున్నాడని ఆయన వర్గం చెబుతోంది. సాధారణంగా ఎన్నికల వేళ చోటా నాయకులే క్షణం తీరిక లేకుండా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటిది టిడిపి అధినేత కొడుకైన లోకేశ్ కు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయినా ఆయన మ్యాచ్ హైలెట్స్ చూసుకుంటానని తాపీగా ట్వీట్ చేయడంతో తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు మొదలయ్యాయి.
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇంకా చాలా రోజులుంటాయి. వాటిపై చినబాబు నుంచి మరిన్ని ట్వీట్లు రావడం ఖాయం.