మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురంలో ఆదివారం జరిగిన ఎన్నికల శంఖారావం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక్కసారి గతం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అయిన నిరుద్యోగ భృతిని కూడా ఎన్నికల సమీపిస్తుండగా ఇచ్చారు. అది కూడా తెలుగు తమ్ముళ్లకే.. లోకేశ్‌కు ఇవన్నీ తెలిసి కూడా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తామని ఆర్భాటంగా చెప్పారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తన కొడుక్కి మంత్రి పదవి అనే ఉద్యోగం వస్తుంది కానీ.. యువతకు ఏమీ చేయరని ఇప్పటికే అనేకసార్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించారు. ఒక్క సంతకంతో వాటిల్లో 1.34 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఇంకా అనేక ప్రభుత్వ శాఖల్లో శాఖల్లో ఖాళీలు భర్తీ చేశారు. ఆరు వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారు.
లోకేశ్ చేసిన ప్రసంగంపై రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో సీఎం జగన్మోహన్రెడ్డి 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. బాబు కేవలం 34 వేలు మాత్రమే ఇచ్చారు. సీఎం జగన్ 1.43 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవేమీ తెలుసుకోకుండా లోకేశ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు నేడు శరవేగంగా సాగుతున్నాయి. అవగాహన లేకుండా లోకేశ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. తండ్రీకొడుకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని కోరిన దమ్మున్న నాయకుడు మా సీఎం. ఇలా అడిగే ధైర్యం బాబు, లోకేశ్‌కు ఉందా?, ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటూ మంత్రి డిమాండ్ చేశారు.