గత ఏడాది సెప్టెంబర్ 9 న స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు షుమారు 53 రోజులు జైలు జీవితం గడిపారు. అరెస్ట్ కాగానే తన పై నమోదైన అవినీతి కేసు క్వాష్ చేయించుకోవటానికి విఫలయత్నం చేసిన బాబు కుదరకపోవడంతో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. కానీ కేసు తీవ్రత దృష్ట్యా ఏసీబీ కోర్టు నుండీ సుప్రీం కోర్టు వరకూ పలు దఫాలు బెయిల్ పిటిషన్స్ తిరష్కరించడంతో దిక్కుతోచని బాబు లాయర్లు ఆయనకి పలు రకాల అనారోగ్యాలు ఉన్నాయని అవి ముదిరి ప్రాణానికే ప్రమాదంగా పరిగణించాయని వైద్యం కోసం అంటూ బెయిల్ ప్రయత్నాలు చేయసాగారు.
ఇదే సమయంలో నా భర్త జైల్లో కష్టపడుతున్నాడు, ఆయన్ని జైల్లో పెట్టినందుకు 153 మంది మరణించారు. వారిని పరామర్శించటానికి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేస్తానని ప్రకటించి అక్టోబర్ 25 న కుప్పం నుండీ యాత్ర మొదలుపెట్టి అక్టోబర్ 31 న బాబుకి పలు అనారోగ్యాలకి వైద్యం కొరకు తాత్కాలిక బెయిల్ రాగానే ఈ యాత్ర ఆపేసారు. ఈ క్రమంలో బాబు అరెస్ట్‌కి బాధతో చనిపోయిన వారు అని చెప్పబడుతున్న 153 మందిలో ముగ్గురి కుటుంబాలని పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. బాబుకి బెయిల్ రాగానే మిగతా 150 కుటుంబాల కష్టాలు తీరాయి, వారిని పరామర్శించాల్సిన పని లేదు అనుకొన్నారేమో అర్ధాంతరంగా ఆపేసారు యాత్ర.
మళ్ళీ అరవై మూడు రోజుల తర్వాత ఆ నూట యాభై కుటుంబాలు హటాత్తుగా గుర్తు రావటానికి కారణం ఒకటి ఎన్నికలు సమీపిస్తుండడం, రెండు ఈ నెల ఎనిమిదిన బాబు బెయిల్ రద్దు కేసు సుప్రీం కోర్టులో విచారణకు వస్తుండడంతో ప్రజల్లో సానుభూతి కోసమేననేది విశ్లేషకుల మాట.
యాత్రకు నిజం గెలవాలి అనే పేరు పెట్టారు కానీ ఆ నిజం ఏంటో ఎక్కడా వెల్లడించలేదు భువనేశ్వరి గారు. ఇదీ నిజం, ఈ నిజం గెలవాలి అనే అంశమే లేకుండా కేవలం సానుభూతి ధ్యేయంగా మరోసారి ప్రారంభమవుతున్న యాత్ర కొనసాగుతుందో లేక ఎనిమిదవ తారీఖు బెయిల్ రద్దు కేసు కొట్టివేస్తే అంతటితో ఆగుతుందో వేచి చూడాలి.
కొసమెరుపు ఏంటంటే నిజం గెలవాలి అనే భువనేశ్వరి గారి యాత్ర తాత జైల్లో లేడు విదేశాల్లో ఉన్నాడు అని మనవడికి అబద్దం చెప్పామంటూ మొదలైంది. యాత్ర ముగిసేనాటికి మనవడు తాతని జైల్లో చూడటంతో తాత విదేశాల్లో లేడు ఖైదీగా జైల్లో ఉన్నాడు అనే నిజం మనవడికి తెలియడంతో నిజం గెలిచినట్టు అయ్యింది. నిజం గెలిచాక మళ్ళీ ఇప్పుడు యాత్ర ఎందుకో .