రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలుఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తున్నాయి.
పోలింగ్ గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తూ వస్తోన్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకుని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటోన్నాయి.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్మత్, పొలిటికల్ క్రిటిక్, లోక్‌పోల్, ఆత్మసాక్షి సంస్థలు తన సర్వే వివరాలను వెల్లడించాయి.
ఇప్పుడు తాజాగా నాగన్న సర్వేలో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే కోసం ఒక్కో నియోజకవర్గంలో 600 మంది చొప్పున 157 స్థానాల్లో 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించారు . మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగింది. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు.
నాగన్న సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 103 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయఢంకా మోగిస్తుంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీకి 39 స్థానాలు మాత్రమే దక్కుతాయి. మిగిలిన మరో 33 సీట్లల్లో వైఎస్ఆర్సీపీ- టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇందులో కూడా 20 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడతాయని సర్వె స్పష్టం చేసింది.
లోక్‌సభ నియోజకవర్గాల విషయానికి వస్తే 20 నుంచి 21 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనాన్ని ఎగురవేస్తుంది. ఇక్కడ కూడా టీడీపీ కూటమికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే అంచనా వేసింది.