కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి వైఎస్సార్సీపీలోకి చేరుతున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సంచలన రాజకీయ నేపధ్యం ముద్రగడ వారసత్వం . వీరి తండ్రి వీర రాఘవ రావు గారు రెండు సార్లు ప్రత్తిపాడు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ముద్రగడ 1978 నుండి 89 వరకూ జరిగిన నాలుగు ఎన్నికల్లో ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా గెలిచి 94 వరకూ కొనసాగారు. 1999 లో కాకినాడ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు .
రాజకీయ పార్టీ ఏదైనా కాపు రిజర్వేషన్ కోసం, కాపుల ఐక్యత కోసం, కాపులకు రాజ్యాధికారం కావాలని సుదీర్ఘ కాలం తపించి పోరాడిన వ్యక్తి ముద్రగడ. సుదీర్ఘ రాజకీయ నేపధ్యాన్ని, సీనియరిటిని పక్కన పెట్టి కాపు ఐక్యత కోసం పవన్ కళ్యాణ్ కి కూడా మద్దతు ఇవ్వడానికి సిద్దపడ్డ నాయకుడు ముద్రగడ .
పవన్ కళ్యాణ్ కాపులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల బహిరంగ లేఖలో వెల్లడించిన ముద్రగడ పవన్ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇటీవల కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి ముద్రగడను వైసీపీ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దాంతో ఈనెల 14న తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువాను ముద్రగడ కుటుంబం కప్పుకోనుంది. ఈ సందర్భంగా తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని సీఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ వెల్లడించారు. కాగా వైఎస్సార్సీపీలో ముద్రగడ చేరికతో కాపుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.