సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మరికొద్దిరోజులే సమయం ఉంది. దీంతో ఎలక్షన్ కమిషన్ పనులను వేగవంతం చేసింది. జిల్లాల్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ కోసం గదుల ఎంపిక, స్టాఫ్ నియామకం, పోలీస్ బందోబస్తు తదితర వ్యవహారాలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో వసతులను కల్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు.
లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థి రూ.40 లక్షలు మాత్రమే గరిష్టంగా ఖర్చు పెట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మొత్తాన్ని బహిరంగ సభలు, పోస్టర్లు, వాహనాల వినియోగానికి వాడుకోవాలి. ఎన్నికల వ్యయంపై ప్రత్యేక ఖాతా నిర్వహించాలి. అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద రూ.50 వేలు, స్టార్ క్యాంపెయినర్ వద్ద రూ.లక్షకు మించి ఉండకూడదు. రూ.10 వేలకు మించి విలువైన వస్తువులు రవాణా చేయడం నిషేధం. పరిమితికి మించి నగదు ఉంటే వాహనాలను సీజ్ చేస్తారు. ఎంపీగా పోటీ చేసేవారు రూ.25 వేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించకూడదు. బహిరంగ సభలు, కార్యక్రమాలకు ముందుగా అనుమతి తీసుకోవాలి. పార్టీలు నిర్వహించే అన్ని కార్యక్రమాలను వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాల్సిందే. రోజువారీ రిజిస్టర్‌తోపాటు నగదు, బ్యాంక్ రిజిస్టర్లను నిర్వహించాలి. నగదు వ్యయంపై నిఘా ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించాక ప్రవర్తిన నియమావళి అమల్లోకి వస్తుంది. నోటిఫికేషన్ ఐదారు రోజుల తర్వాత వస్తుంది. తదితర వివరాలను ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.