టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేష్ బీజేపీ తరుపున కోయంబత్తూరులో బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు, ఈ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ ఆర్ధిక ముఖ చిత్రాన్ని మార్చేసిన దార్సనికుడు అని పొగడ్తల వర్షం కురిపించారు . ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా, లోకేష్ పొగడ్తలు చూసిన తమిళనాడు ప్రజలకి ఏమీ అనిపించక పోవచ్చు కానీ లోకేష్ నోటి వెంట విన్న తెలుగు ప్రజలకు మాత్రం ఎబ్బెట్టు అనిపించక మానదు.
2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ 2018 లో పొత్తునుండి విడిపోయి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే, అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు బిజెపిని తిట్టిన తిట్లు ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
తెలుగు ద్రోహి మోడీ, ఖబడ్దార్ మోడీ, గో బ్యాక్ మోడీ, చేతగాని ప్రధాని మోడీ, అబద్దాల పుట్ట మోడీ అంటూ ఎల్లో మీడియాలో హెడ్ లైన్స్ తో వచ్చిన వార్తల తాలూకూ క్లిప్పింగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసాడని, విభజన హామీలు నెరవేర్చలేదని, రెవిన్యూ లోటు తీర్చలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని, రాజధాని శంఖుస్థాపనకి పిలిస్తే నీళ్లు, మట్టి మొహాన కొట్టాడని బాబు, లోకేష్ లు పుంఖానుపుంఖాలుగా విమర్శలు చేశారు. లోకేష్ మామ బాలకృష్ణ ఒకడుగు ముందుకు వేసి మాకీచూద్ అంటూ బూతు పురాణం అందుకొన్నాడు.
నాడు దేశ ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నాం చేసాడని, వంద లక్షల కోట్ల అప్పు చేసాడని విమర్శిస్తూ దేశాన్ని ఏకం చేస్తా, మోడిని దించేస్తా అంటూ ప్రత్యేక విమానంలో దేశం మొత్తం తిరిగాడు చంద్రబాబు. చివరికి 2019 ఎన్నికల్లో ఓడిపోయాక 2020 నుండి మళ్ళీ బీజేపీ ప్రాపకం కోసం యత్నించి చివరికి రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేసి అలా బిజెపిలో చేరిన ఎంపీలు, పవన్ కళ్యాణ్ సహాయంతో మళ్ళీ బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు బాబు.
పొత్తు పెట్టుకొన్నాక నాడు తీవ్రంగా తిట్టిన నోటితోనే పొగడాల్సిన భాద్యత మీద పడింది. తప్పనిసరి అయినప్పుడు ఏ తప్పుడు పని చేయటానికి అయినా సిద్దపడే తత్త్వం ఉన్న బాబు ఏపీలో మోడీ, బిజెపిలను పొగుడుతుండగా, లోకేష్ మరో అడుగు ముందుకేసి కోయంబత్తూరు వెళ్లి మోడీని పొగడసాగాడు.
2019 లో బాబు దేశం మొత్తం తిరిగి మోడిని తిట్టిన పాపానికి శిక్షగా ఈ ఎన్నికల్లో లోకేష్ ని దేశం మొత్తం తిరిగి మోడిని పొగడమని శిక్ష వేసిందేమో బీజేపీ అధిష్టానం.