వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుందో లేక బాబు వక్రబుద్ధి బయటపడుతుందో తెలియదు గానీ నలభై ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి గిరి, పాతికేళ్ల ప్రతిపక్ష నేత అనుభవం, సుదీర్ఘ కాలపు రాజకీయ నేత అని అని తన అనుకూల పత్రికలు, ఛానెల్లలో డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు… తన 45 ఏళ్ల అనుభవానికి ఏమాత్రం సంబంధం లేకుండా, కనీస ఆలోచన అవగాహన లేకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో నిలబడే హక్కు ఉంటుందనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా అభ్యర్థులను వారి వారి వృత్తులను బట్టి అవహేళన చేస్తూ తన బుద్ధిహీనతను బయట పెట్టుకుంటున్నాడు.
ఇక విషయానికొస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు బహిరంగ సభల్లో మాట్లాడుతూ సింగనమల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వానికి వీరాంజనేయులు అనే టిప్పర్ లారీ డ్రైవర్ తప్ప ఎవరు దొరకలేదు అంటూ అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. అంటే బాబు ఉద్దేశంలో లారీ డ్రైవర్లు ఎన్నికల్లో పోటీకి అనర్హులా? లేక వాళ్లకు రాజకీయ అవకాశాలు ఇవ్వకూడదు అని బాబు రాజ్యాంగంలో ఏమైనా రాసారా? ఒకపక్క జగన్ సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దుతూ ఎప్పుడూ చరిత్రలో ఊహకు కూడా అందని సామాజిక వర్గాల నుంచి, అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి అతి సామాన్యులను నేతలుగా తయారు చేస్తూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతుంటే… 40 ఏళ్ల అనుభవం దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడుని అని చెప్పుకునే చంద్రబాబు కనీస మర్యాద లేకుండా ఎదుటి మనిషిని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియని స్థితిలో ఓటమి భయంతో అభద్రతాభావానికి లోనవుతున్నాడు.
ఇది ఇలా ఉంటే మరొక పక్క ఏ ఆధారం లేక, మంచి చెడు పట్టించుకునే వాళ్ళు లేక, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే అవ్వ తాతలకు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదు అని తన అనుయాయులు చేత కోర్టులో కేసులు వేయించి, పరోక్షంగా దాడి చేసి, వాళ్ళ కడుపుల మీద కొట్టాడు. కనీస ఆధారం లేని ముసలి ప్రాణాలకు మంచి చేయటానికి కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నాడు అంటే… ఎంత నీచమైన రాజకీయానికి తెరతీస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇదేనా 40 ఏళ్ల అనుభవానికి ఉండాల్సిన బాధ్యత.. ఇదేనా 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు పరిపాలనా దక్షత? ఇలాంటప్పుడే తెలుస్తుంది జన్మభూమి కమిటీలకు వాలంటరీ వ్యవస్థకి మధ్య తేడా… కనీసం విచక్షణ లేకుండా సాటి మనుషులను గౌరవించలేని చంద్రబాబు, అవ్వ తాతలు ఒక పూట ముద్దకి నోచుకోకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు కేవలం ఓటమి భయంతోనే ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా, అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా రోజు రోజుకి దిగజారిపోయి ఓటమి నుంచి మరింత భారీ ఓటమికి చేరువవుతున్నాడు.