2024 సార్వత్రిక ఎన్నికలకు మరో 10 రోజులు కూడా లేవు. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే సిద్ధం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సభలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి, తన మలి విడత ప్రచారంలో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర మొత్తం బస్సు యాత్రలో తిరిగి ప్రజలతో మమేకం అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ కోసం సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ కోసం సిద్ధం అంటూ మరో అడుగు ముందుకేసి గ్రామస్థాయి నాయకులతో ఇంటింటికి మేనిఫెస్టోను ప్రచారం చేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జగన్ కోసం సిద్ధం.. పేరుతో వైఎస్సార్సీపీ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో అమలు చేసింది వైఎస్సార్సీపీనే అని, అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. 2019 మేనిఫెస్టోను అమలుపరచిన తీరును, 2024 మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకపోవడం మరోసారి ప్రజలకి గుర్తు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.