తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ వైద్యమంటే ప్రజలు భయపడేవారు. పల్లె, పట్టణం, నగరంలోని ఏ సర్కారు ఆస్పత్రికి వెళ్లినా నరకమే. డాక్టర్లు, సిబ్బంది, మందుల కొరత వేధించేది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటి ముంగిటకే వైద్యసేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక రోగులకు ఉచితంగా మందులను డోర్ డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంది. నిరుపేదలకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక ఇబ్బందులను తప్పించింది. ఇందులో భాగంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఖరీదైన మందులను పక్కాగా ప్యాక్ చేయించి మరీ వ్యాధిగ్రస్తులకు చేరుస్తోంది. ఇది కచ్చితంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనతే.
సీఎం జగన్ 2019 నుంచి ఇప్పటి వరకు వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో ఆస్పత్రుల ఆధునికీకరణ చేశారు. కొత్తగా 304 పీహెచ్‌సీలు పెట్టారు. 53 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసి సిబ్బంది కొరత తీర్చారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన అధునాతన యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం 1,142 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్విరామంగా వైద్యం అందుబాటులో ఉంది. వాటిల్లో 160 రకాల మందులను అందుబాటులోకి తెచ్చింది. పల్లెల్లో 2,500 మందికి ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. ఇవి సుమారు 11,480 ఉన్నట్లు అంచనా. ఈ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది.
ఇప్పుడు ఏమి చేశారంటే..
ప్రభుత్వం తొలుత ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజస్) సర్వేను పక్కాగా చేసింది. అందులో భాగంగా ప్రజలకు వైద్య పరీక్షలు చేయించింది. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందిపడుతున్న వారిని గుర్తించి అందిస్తున్న వైద్యసేవల వివరాలను ముందుగా మ్యాపింగ్ చేయించింది. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తదితర బాధితులకు ఖరీదైన మందులను వ్యాధిగ్రస్తుల ఇంటికే పంపుతోంది. ఇందుకోసం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఆయా మందులను సిద్ధం చేయించి, వాటిని మంచిగా ప్యాక్ చేసి విలేజ్ క్లినిక్‌లోని ఎంఎల్‌హెచ్‌పీకి అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం మందులను ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా రోగుల ఇంటికే వెళ్లి అందజేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆర్థిక భారం తప్పుతోంది. మెడిసిన్స్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకండా పోయింది. ఈ కార్యక్రమం నిరుపేదలకు వరంలా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.