చంద్రబాబుకు ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడమే పని. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన అకృత్యాలను మర్చిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారిపై తప్పుడు ప్రచారాలు చేస్తుంటాడు. గుడులు కూల్చింది బాబు.. మళ్లీ కట్టించింది జగన్ అయితే ఎల్లో మీడియా మాత్రం అబద్ధాలను చెబుతుంటుంది. ఓట్ల కోసం నారా వారికి వంత పాడుతుంటుంది.
ఇద్దరి పాలనకు ఎంతో తేడా
2016లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు విజయవాడలో 30 ఆలయాలు కూల్చేశారు. జగన్ సీఎం అయ్యాక ఎనిమిది ముఖ్యమైన గుడులను పునఃనిర్మించారు. 2021లో సీఎం శంకుస్థాపన చేయగా రూ.3.87 కోట్లతో పనులు పూర్తి చేశారు. గత డిసెంబర్ 8వ తేదీన భక్తులకు అంకితమిచ్చారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో బోడికొండపై ఉన్న కోదండరాముని ఆలయం 2014లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్ కారణంగా శిథిలమైంది. ప్రహరీ, ధ్వజస్తంభం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నది ఎవరో కాదు.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు. అప్పుడు సీఎంగా బాబు ఉన్నా ఆలయం అభివృద్ధిని వారిద్దరూ పట్టించుకోలేదు. దుండగులు రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ పెట్టి రూ.4 కోట్లతో ఆ గుడిని పునఃనిర్మించింది. విజయవాడ దుర్గ గుడి అభివృద్ధి కోసం బాబు ఒక్క రూపాయి ఇవ్వలేదు. జగన్ సర్కారు రూ.70 కోట్లు ఇచ్చింది. రూ.216 కోట్లతో కొండ రక్షణ పనులు చేపట్టింది. రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, అన్నప్రసాద భవనం, పోటు భవనం తదితర వాటికి శంకుస్థాపన జరిగింది ఈ ప్రభుత్వ హయాంలోనే..
ఇంకా ఎన్నో..
డీడీఎన్ఎస్ పథకాన్ని ఆదాయం లేని ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ప్రవేశపెట్టారు. ఇది 1,620 ఆలయాలకు మాత్రమే వర్తిస్తోంది. అందులో 1,500 వరకూ ఉమ్మడి ఏపీలో మంజూరు చేసినవే. దీనిని బట్టి బాబు తన హయాంలో ఆలయాలపై ఏ మాత్రం శ్రద్ధ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ పాలనలో డీడీఎన్ఎస్ పథకాన్ని 4,834 ఆలయాలకు వర్తింపజేశారు. ఇంకా 757 పురాతన ఆలయాలను కామన్‌గుడ్ ఫండ్ నిధులతో పునఃనిర్మాణం చేయడంతోపాటు టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కొత్తగా 2,872 గుడుల నిర్మాణం చేపట్టారు.
బాబు ద్వేషి
చంద్రబాబును హిందూ మత ద్వేషిగా చెప్పొచ్చు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన ఘనుడు ఆయన. 2015లో గోదావారి పుష్కరాల్లో తన ప్రచారం కోసం 29 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నాడు. డాక్యుమెంట్రీ చిత్రీకరణ కోసం వీఐపీ ఘాట్‌లో కాకుండా సాధారణ భక్తుల కోసం ఏర్పాటుచేసిన ఘాట్‌లో షూటింగ్ చేయడమే దీనికి ప్రధాన కారణం. పైగా బాబు దీనికి కుంభమేళాలో చనిపోలేదా.. ఒక్కోసారి జరుగుతుంటాయని సమర్థించుకున్నాడు. ఆయన కారణంగా అంతమంది చనిపోయినా ఏ మాత్రం చలించలేదు. పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని పాల్గొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జగన్ సీఎం అయ్యాక ఆలయాలను అభివృద్ధి చేస్తే ఓర్వలేక తెలుగుదేశం, జనసేన అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి.