ఎర్రబుక్కు నాయకుడు నారా లోకేశ్‌ను తెలుగుదేశం శ్రేణులు అతిగా ఊహించుకుంటుంటాయి. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా ఇచ్చే ఎలివేషన్లను ఎవరైనా సంభమాశ్చర్యాలకు గురికావాల్సిందే. తాజాగా ఒకప్పటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే).. తాను వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేయడంలేదని తేల్చి చెప్పి అటు లోకేశ్.. ఇటు తెలుగు తమ్ముళ్ల గాలి ఒకేసారి తీసేశారు.
ఏమి జరిగిందంటే..
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఆయన్ను అనరాని మాటలన్నారు. బాబైతే తానే పెద్ద వ్యూవహకర్తనని స్టేజీల మీద గొప్పలు చెప్పుకొన్నారు. ఒకానొక సందర్భంలో కిశోర్ ఐప్యాక్ నుంచి తప్పుకొని రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం జైల్లో ఉండగా లోకేశ్ పాదయాత్ర ఆపేసి ఢిల్లీ బాట పట్టాడు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ద్వారా ప్రశాంత్ కిశోర్‌తో మాట్లాడాడు. 2024 ఎన్నికల్లో తమ పార్టీకి వ్యూవహకర్తగా పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు. బాబు బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాక డిసెంబర్ చివరి వారంలో ఒకరోజు ఒకే విమానంలో ప్రశాంత్, లోకేశ్ కలిసి విజయవాడకు వచ్చారు. అంతే.. ఒకవైపు బాబు అండ్ కో, మరోవైపు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెరతీశారు. లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు.. వ్యూహాలు రచించడంలో దిట్ట.. పీకేకు జగన్ పాలన నచ్చక వదిలేశాడు.. ఇకనుంచి బాబు కోసం పనిచేస్తాడు.. ఇద్దరు వ్యూహకర్తలు కలిశారు.. ఇక వైఎస్సార్సీపీ పనైపోయింది.. అంటూ ప్రచారం చేశారు. ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే అంతటి పీకేనే టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకొన్నాడు. ఇదంతా లోకేశ్ రాజకీయం అంటూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేసి మరీ ఎల్లివేషన్లు ఇచ్చాయి. అందరూ అంటున్నట్లుగా ఆయన ఆంధ్రా పప్పు కాదని, రాటుదేలిన వ్యక్తి అని పలుకులు పలికారు. తీరా చూస్తే అంత సీన్ లేదని తేలిపోయింది.
బాబుతోనా.. నో..
తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన బాబుతో కలిసి పనిచేయడంలేదని స్పష్టత ఇచ్చారు. చంద్రబాబే తనను కలవాలి అనుకున్నాడని ఓ పెద్ద నేత ద్వారా తెలిసిందన్నారు. తెలుగుదేశం కోసం పనిచేయాలని అడిగారని తాను కుదరదని చెప్పానన్నారు. వ్యూహకర్త పనికి దూరంగా ఉంటున్నట్లు సదరు నేతకు వెల్లడించానని, ఆయన కోరిక మేరకు ఈ విషయాన్ని నేరుగా వెళ్లి తెలిపానన్నారు. పీకే నోటి వెంట ఈ మాటలు వినగానే ఎల్లో గ్యాంగ్ ఢీలా పడిపోయింది.
కొడుకు విషయంలో పాపం బాబు
చంద్రబాబు తన కొడుకు లోకేశ్ రాజకీయంగా పెద్ద వాడ్ని చేయాలని తహతహలాడుతుంటాడు. అతనికి అంత సీన్ లేదని, జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని పలువురు సీనియర్ నేతలు బహిరంగంగా మాట్లాడితే బాబు వారి నోళ్లు మూయించాడు. లోకేశ్ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి దొడ్డిదారిలో మంత్రిని చేశాడు. అయితే చినబాబు సబ్జెక్టు లేని వ్యక్తిగా మిగిలిపోయాడు. పార్టీ పేరు తెలుగుదేశం.. అయితే లోకేశ్ తెలుగు మాట్లాడలేడు. సభల్లో తప్పులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాడు. తన చేష్టలతో ఆంధ్రా పప్పుగా పేరు తెచ్చుకున్నాడు. పాదయాత్ర చేయలేక తండ్రి స్కిల్ కేసును అడ్డం పెట్టుకుని ఢిల్లీలో తిష్ట వేస్తే కొందరు టీడీపీ నేతలు లోకేశ్ మామూలు వ్యక్తి కాదని పొగిడి నవ్వులు పూయించారు. ప్రశాంత్ కిశోర్ పనిచేయనని ఖరాఖండిగా చెప్పిన మాటలతో చినబాబుకు ఇచ్చిన ఎలివేషన్లు అంతా వేస్ట్ అయిపోయాయని తెలుగు తమ్ముళ్లు విషాదంలో మునిగిపోయారు. గొప్ప వ్యూహకర్తని, విజనరీని, కేంద్రంలో చక్రాలు తిప్పిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని తనకు తాను చెప్పుకొనే చంద్రబాబు.. ఎర్రబుక్కులో పేర్లు రాసుకుని ఉడత బెదిరింపులు చేసే కొడుకును చూసి పళ్లు కొరుక్కుంటూ ఉండిపోవడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి.