యానిమల్ సినిమాలోని నాన్నా.. నువ్వు నా ప్రాణం పాటను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ రిపీట్ మోడ్‌లో వింటున్నాడంట. అంతటితో ఆగకుండా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ సినిమాలు బాగా చూస్తున్నాడని తెలుగు తమ్ముళ్ల నుంచి వస్తున్న టాక్. దీనికి కారణాలు లేకపోలేదు.
టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థానం లోకేశ్‌దని అందరూ భావిస్తుంటారు. కానీ బాబు తన కొడుకును స్టార్ క్యాంపెయినర్ పోస్టు నుంచి తీసేసి పవన్ కళ్యాణ్‌కు ఇచ్చాడు. వారిద్దరూ కలిసి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుంటే చినబాబు మాత్రం మంగళగిరి నియోజకవర్గ వీధుల్లో అయిష్టంగా తిరుగుతున్నాడు. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ప్రచారంపై పూర్తిగా దృష్టి పెట్టలేదు.
బుధవారం తణుకులో ప్రజాగళం, నిడదవోలులో వారాహి విజయభేరి సభలు జరిగాయి. వీటికి చంద్రబాబు, పవన్ హాజరయ్యారు. లోకేశ్‌ను దూరం పెట్టేశారు. ఇదే రోజు చినబాబు మంగళగిరి నియోజకవర్గం చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డులోని జూపిటర్ అపార్టుమెంట్ వాసులతో సమావేశమయ్యాడు. వాస్తవానికి లోకేశ్‌కు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని ఉందని ఆయన వర్గం చెబుతోంది. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని బాబు దూరం పెట్టినట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు.
బాబు.. తన కంటే పవన్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని లోకేశ్, ఆయన వర్గం లోలోన రగిలిపోతోంది. అందుకే చినబాబు ప్రచారాన్ని అంతంతమాత్రంగా చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నాడు. మంగళగిరిలోనే నువ్వు గెలిచే పరిస్థితి లేదని, ముందు అక్కడ సంగతి చూడు. రాష్ట్రం సంగతి మేము చూసుకుంటామని చంద్రబాబు లోకేశ్‌తో అన్నాడని తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. తనపై తండ్రికే నమ్మకం లేదని, 2019లో రెండుచోట్ల ఓడిపోయిన సేనానిపై టన్నుల్లో నమ్మకం పెట్టుకున్నాడని చినబాబు సన్నిహితుల వద్ద బాధపడ్డాడట.
ఆ మధ్య ప్రధాన మోదీ వచ్చిన సభకు లోకేశ్ వచ్చినా దూరంగానే ఉంచారు. ఇప్పుడేమో ఎన్నికల ప్రచార సభలను బాబు, పవన్ కలిసి నిర్వహిస్తున్నారు. ప్రాధాన్యం విషయంలో తండ్రీకొడుకుల మధ్య హైదరాబాద్ ఇంట్లో వాగ్వాదం జరిగిందని పచ్చ మీడియాకు చెందిన వారు గుసగుసలాడుకుంటున్నారు. లోకేశ్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా తప్పించడంపై ఆయన భార్య బ్రాహ్మణి కూడా కోపంగా ఉన్నారని సమాచారం. గురువారం పి.గన్నవరంలో వారాహి విజయభేరి, అమలాపురంలో ప్రజాగళం సభలు జరుగుతాయి. వీటికి లోకేశ్ ఆహ్వానం లేదని తెలుస్తోంది. జనసేన తన స్టార్ క్యాంపెయిన్ల లిస్టులో జబర్దస్ ఆర్టిస్టులు హైపర్ ఆది, గెటప్ శ్రీనులకు స్థానం కల్పించింది. చంద్రబాబు మాత్రం టీడీపీ నుంచి తన కుమారుడికి అవకాశం కల్పించలేదు. తనకు అన్యాయం జరుగుతోందని చినబాబు కుమిలిపోతోంటే.. బాబు మాత్రం పవన్‌తో కలిసి నవ్వుకుంటూ తిరుగుతున్నాడు.