చంద్రబాబుకు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలని ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మండల ఆత్మియ సమావేశంలో మాట్లాడిన నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్లు ఎంపీ టికెట్లు అమ్ముకుని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎంపీగా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన నాని 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలవబోతున్నాని ధీమా వ్యక్తం చేశారు.
పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, చంద్రబాబు పాలనలో కేవలం ధనికులు మాత్రమే సంతోషంగా ఉంటారని కేశినేని నాని హెచ్చరించారు. తనపై పోటీ చేసేందుకు పిట్టలదొరలు, కాల్ మనీ గాళ్ళు కాకుండా చంద్రబాబు ధైర్యంగా పోటీ చేయాలని సవాల్ విసిరిన నాని లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే చంద్రబాబు కోరికని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకి టీడీపీకి చివరి ఎన్నికలని తరువాత టీడీపీ పూర్తిగా కనుమరుగై పోతుందని జోస్యం చెప్పారు.