‘చంద్రబాబు నాయుడి రోడ్‌షోకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తక్కువగా వచ్చి, జనసేన వాళ్లు ఎక్కువగా వస్తే మన పరువు పోతుంది. మీ పుణ్యముంటుంది. మా కోసం వచ్చి బాబు స్పీచ్ వరకు ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం. యువతను పంపండి. డబ్బులిస్తాం’ అంటూ టీడీపీ నెల్లూరు సిటీ, రూరల్ అభ్యర్థులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేడర్‌ను అడుక్కుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల్లూరుకు విచ్చేస్తున్నారు. రూరల్ పరిధిలోని కేవీఆర్ పెట్రోల్ బంకు నుంచి ఫత్తేఖాన్‌పేట, ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్ వరకు, అక్కడి నుంచి సిటీ పరిధిలో రోడ్‌షో చేసేలా ప్రణాళిక వేశారు. కూటమిలో జనసేనకు ఏ మాత్రం బలం లేదని, వాళ్లు తమ దయ మీద ఆధారపడి బతుకున్నారని, అంతా టీడీపీ ఇష్టమని చూపించుకునేందుకు అభ్యర్థులు తెగ కష్టపడుతున్నారు. పార్లమెంట్ బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం సభకు జన సమీకరణ చేయలేక అల్లాడిపోయానని, ఎంత డబ్బు కావాలన్నా తీసుకుపోవాలని, ఈసారికి నువ్వే జనాన్ని తరలించు అని శ్రీధర్‌రెడ్డికి చెప్పేశాడు. ఆయన ఇదే సమయమని భారీగా డబ్బు తీసేసుకున్నాడు. ఇప్పుడు కేడర్‌ను బతిమిలాడుకుంటున్నాడు.
ఇక నారాయణకు ఎలాగూ ప్రజా బలం లేదు. దీంతో ఎన్టీం ద్వారా రోడ్‌షోకు వచ్చి టీడీపీ జెండాలు పట్టుకుంటే డబ్బులిస్తామని యువతను ప్రలోభపెడుతున్నారు. కార్యక్రమంలో సేన జెండాలు తక్కువగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కిందే పవన్ కూడా పనిచేస్తున్నాడని చూపించే యత్నం ఇది. ఇదిలా ఉండగా లోకేశ్ బుధవారం నెల్లూరులో పర్యటించారు. దీనికే తెలుగు తమ్ముళ్లు చాలామంది హ్యాండ్ ఇచ్చారు. దీంతో అధినేత రోడ్‌షోకు తక్కువ సంఖ్యలో వచ్చే అవకాశముందని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
సభ జరిగే ప్రాంతానికి జనం వచ్చారా లేదా? అని ముందుగానే బాబు తెలుసుకుంటున్నారు. జనం లేరని చెబితే అభ్యర్థులను తిట్టి తోలమని చెబుతున్నాడు. ఇటీవల ఆత్మకూరు సభ విషయంలోనూ ఇదే జరిగింది. మూడు గంటలు ఆలస్యంగా వచ్చాడు. జనసేన నేతలు తాము రోడ్‌షోకు పెద్ద ఎత్తున పవన్ అభిమానులను తరలిస్తామని, కాకపోతే వారికి మద్యం, ఇతర ఖర్చులకు డబ్బు ఇవ్వాలని సిటీ, రూరల్ అభ్యర్థులను అడిగారట. వారు.. వస్తే రండి.. లేకపోతే పోండని సమాధానమిచ్చారని నెల్లూరులో ప్రచారం జరుగుతోంది. వీటిన్నింటి మధ్య కమలం నేతలు, కార్యకర్తల్ని పట్టించుకున్న నాథుడే లేడు.