ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో చేరేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా టీడీపీకీలక నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఎద్దల చెరువు వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైయస్ఆర్ సీపీలో చేరారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విష్ణువర్ధన్‌రెడ్డి పోటీ చేశారు. ఈ సారి టీడీపీ టికెట్ ఆశించిన విష్ణువర్ధన్‌రెడ్డికి టికెట్ రాకపోవడంతో.. క్రమంగా టీడీపీకి దూరమయ్యారు.. వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
కాగా ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరభేరి మోగిన నేపథ్యంలో పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండగా వైసీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకూడదనే లక్ష్యంతో ప్రత్యర్థి పార్టీలన్ని కలిసి పోటీ చేస్తుండగా సంక్షేమ పథకాలు వైసీపీని గెలిపిస్తాయని సీఎం జగన్ విశ్వసిస్తున్నారు.