గతంలో పచ్చని పంట పొలాలతో అలరారిన పల్నాడు జూలకంటి బ్రహ్మారెడ్డిహయాంలో ఫ్యాక్షన్ ముఠా కక్షలకు అడ్డాగా మారింది. ప్రజల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషించారు. ముఖ్యంగా 1999 నుండి 2002 వరకూ పల్నాడు ప్రాంతంలో 26 మంది కేంగ్రెస్ నేతల హత్యల జరగగా ఒక్క వెల్దుర్తిలోనే 12 మంది హత్యకు గురవడం గమనించాల్సిన విషయం. ఈ 12 మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా జూలకంటిని వ్యతిరేకించిన వారే కావడం గమనార్హం.
తనకు ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టేందుకు జూలకంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని పెంచి పోషించారని విమర్శలున్నాయి. అప్పట్లో పల్నాడు ప్రాంతంలో బాంబుల తయారీ ఇంటింటికి కుటీర పరిశ్రమగా ఉండేదంటే ఫ్యాక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దుగ్గిరాల మండలం ఆత్మకూరు జంక్షన్ వద్ద ఏడుగురు వెల్దురి వాసులు ఊచకోతకు గురవడంతో రోజురోజుకీ ముఠా కక్షలు పెరిగిపోతుండడంతో 2002 lo జిల్లా ఎస్పీగా వచ్చిన సీతారామాంజనేయులు ఫ్యాక్షన్ ని అంతం చేసేందుకు నడుం బిగించారు. పోలీసులను రాత్రివేళల్లో గ్రామాల్లో మకాం చేయాలని ఆదేశించడమే గాక తానే స్వయంగా మొదట ఆచరించి చూపించారు. ఎస్పీ సీతారామాంజనేయులు వెల్దుర్తిలో మకాం వేసి ఆరుబయట నిద్రించడం లాంటివి చేసి ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తగ్గించడంలో విజయం సాధించారు.
మరోవైపు ఫ్యాక్షన్ ను ఉక్కుపాదంతో అణచివేయడానికి సీతారామాంజనేయులు నడుం బిగించారు. జూలకంటితో పాటు ఆయన అనుచరులకు గుంటూరు పోలీస్ డార్మెటరీలో పోలీస్ మార్క్ లాటీ కౌన్సెలింగ్ ఇవ్వడం, ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని కాస్త కఠినంగానే వ్యవహరించడంతో పల్నాడులో బ్రహ్మరెడ్డి ఫ్యాక్షన్ కి తెరపడింది. కానీ ప్రస్తుతం మళ్ళీ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంచార్జ్ గా రావడంతో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి పెచ్చుమీరుతున్నాయి. నేడు దుర్గి మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో ఓ టీడీపీ నేత ఇంట్లో బాంబులు, గొడ్డళ్ళు, కత్తులు బయట పడడంతో 20 ఏళ్ల నాడు సమసిపోయిన ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చాడు జూలకంటి అని దీన్ని వెంటనే అంతం చేయాలని లేకుంటే శాంతి భద్రతలకు ప్రమాదం ఉందని మాచర్ల నియోజకవర్గ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.