జనసేన పార్టీకి గుర్తూ లేదు, గుర్తింపు లేదని వైసీపీఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఎంపీ కేశినేని నానితో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని, జనసేన జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ 2014, 2024 మేనిఫెస్టోకు ఏమైన తేడా ఉందా? అని ప్రశ్నించిన శ్రీనివాస్, జూన్ 4 తర్వాత పవన్, చంద్రబాబులను ప్రజలు చెత్తబుట్టలో వేస్తారన్నారు. గ్లాస్ గుర్తు లేని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ టీడీపీని బీజేపీ నమ్మడం లేదని, అందుకే టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో బీజేపీ భాగం కాలేదన్నారు. కనీసం మేనిఫెస్టో పేపర్ ని కూడా తాకడానికి బీజేపీ నేతలు ఇష్టపడడం లేదు. టీడీపీ ఇచ్చే హామీలకు తాము భరోసా ఉండమని సంకేతాలు స్పష్టంగా తెలియజేశారు. బీజేపీ దేశవ్యాప్తంగా మేనిఫెస్టో ప్రకటిస్తే, ఇక్కడ అసెంబ్లీ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తున్న వారి మేనిఫెస్టో ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకమైన మేనిఫెస్టోను బీజేపీ ప్రకటిస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు ప్రకటించడం లేదని, టీడీపీని బీజేపీయే నమ్మడం లేదు, ప్రజలేం నమ్ముతారని కేశినేని నాని వెల్లడించారు.