పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశానికి బీటీం అనే మాటలను నిజం చేస్తూ మరో ఇద్దరు టీడీపీ నేతలకు జనసేన తరుపున టికెట్ ఇచ్చే ప్రయత్నం దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. వివరాలలోకి వెళితే తెలుగుదేశం సీనియర్ నేత మండలి బుద్ద ప్రసాద్, పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు జనసేన తరుపున అవనిగడ్డ, పాలకొండ సీట్లు ఇస్తునట్టు వార్తలు వస్తున్నాయి. కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జనసేనకి 24 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే బిజెపితో పొత్తులో భాగంగా మరోసారి చంద్రబాబు ఆడిన ఆట దెబ్బకి ఆ సీట్లు కూడా చివరికి వచ్చే సరికి 21 సీట్లకి తేలాయి.
చంద్రబాబు జనసేనకి కేటాయించిన ఆ 21 సీట్లలో కూడా మొదటి నుండి జనసేనకు పనిచేసిన వారికి కాకుండా తెలుగుదేశంలో క్రీయాశీలకంగా ఉన్న ఆ పార్టీ నేతలకే జనసేన కండువా కప్పి సీటుని అప్పచెప్పడం చూస్తే, జనసేన కూడా కాపు ఓట్ల కోసం చంద్రబాబు పెట్టించిన పార్టీనే అనే విమర్శ నిజం అనే అభిప్రాయాలు అన్ని వైపుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భీమవరం నుండీ టీడీపీ మాజీ లీడర్ పులపర్తి రామాంజనేయులు కి సీటు ఇచ్చిన పవన్ ఇప్పుడు తాజాగా అవనిగడ్డ, పాలకొండ కూడా టీడీపీ నేతలకే అప్పచెప్పడం జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్నికల నాటికి ఇప్పుడు ప్రకటించిన వాటిలో మరికొంత మంది జనసేన వారికి కాకుండా టీడీపీ అసంతృప్తులకు బి పారాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని జనసేన కేవలం అభిమానుల, కాపు ఓటర్లను మభ్యపెట్టి టీడీపీకి మేలు చేయడానికే పని చేస్తుందని పలువురు జన సైనికులే నిర్వేదం వ్యక్తం చేయడం గమనార్హం.