విజయవాడ నగర నడిబొడ్డున బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆవిష్కరించారు. దేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కృతమైంది.
ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామాజిక సమతా సంకల్ప సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది.. దాని గురించి మనం మాట్లాడుతాం.. ఇక మీదట స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమోగుతుందన్నారు. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.
అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తర్వాత, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తర్వాత ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్– సామాజిక న్యాయ మహా శిల్పం కింద ఈ రోజుకీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారన్నారు.
విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న స్వరాజ్ మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు మనం అంబేద్కర్ గారి మహా విగ్రహం ఆవిష్కరిస్తున్నామన్నారు. ఈ విగ్రహం చూసినప్పుడల్లా పేదలు, మహిళలు హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా..సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా.. రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ స్పూర్తి నిస్తూనే ఉంటాడన్నారు వైఎస్ జగన్. ఈరోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా కూడా రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపై నిలబెట్టినది అంబేద్కర్ గారి స్పూర్తి అన్నారు.
అంటరాని తరాన్ని స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును, ఓ విప్లవాన్ని, ఓ స్వాతంత్య్ర పోరాటాన్ని వీటన్నింటినీ ఉమ్మడిగా చూస్తే, ఉమ్మడి చేస్తే…ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు. అటువంటి పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా వేర్వేరు రూపాల్లో ఇవాళ్టికీ ఉన్నాయన్నారు జగన్.
అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడమే మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని వైఎస్ జగన్ అన్నారు. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి, పేద పిల్లలు తెలుగుమీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు.
పొద్దున్నే పత్రిక చదివానని.. అందులో అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట.. వాస్తవం ఏమిటంటే… అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో, ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లిషు మీడియంలో పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో.. తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులకు, బహుజనులకు వ్యతిరేకులు అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దళితులంటే ఎప్పటికీ తమ అవసరాలు తీర్చేవారుగా మాత్రమే వాళ్లు మిగిలిపోవాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు.
పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వాస్పత్రులు, వారి పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులు కళాశాలు, వారు ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సులు ఏవీ పట్టించుకోకుండా వదిలేసి.. వారి ఎదుగుదలకు అడ్డుగా నిలవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని ముఖ్యమంత్రి అన్నారు.
అవ్వాతాతలకు పెన్షన్, రైతన్నల అవసరాలకు, చిన్నా చితక పనులు చేసుకుంటూ పొట్టపోసుకొనే వారు.. ఏ పౌర సేవ కావాలన్నా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా, వారు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని ముఖ్యమంత్రి అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన ఈ రూపం మార్చుకున్న అంటరానితనంపై.. 56 నెలలుగా మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంటుందని వైఎస్ జగన్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం 206 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం.. దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని తెలియజేస్తుందన్నారు.
చంద్రబాబు దళితులకు చేసింది శూన్యం. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంటు భూమిని ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చింది లేదు.. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ ఎస్సీలు ఎలా బతకగలుగుతారనే కనీస ఆలోచన చేయకుండా అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అన్న వ్యక్తి, పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎప్పుడూ చూడని విధంగా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
పెత్తందారీ పార్టీలకు, నాయకులకు చదువుకొనే మన పేద పిల్లల కోసం చదువుల విప్లవం తేవాలని.. మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని ఎందుకు అనిపిస్తుందన్నారు. అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్ తేవాలని.. రైతన్నలకు తోడుగా ఉండాలని.. గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని, సచివాలయం తేవాలని ప్రతి పేదవాడికీ అందుబాటులతో ఉండాలని ఎందుకు అనిపిస్తుందన్నారు?
నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ 50 శాతం పదవులు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేయాలని వాళ్లకు ఎందుకు అనిపిస్తుందన్నారు.. ???
ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో రూ.2.47 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కుతున్నాను. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. పెత్తందారీ పార్టీలు, నాయకులకు ఏరోజైనా ఇలా బటన్ నొక్కడం, తద్వారా రూ.2.47 లక్షల కోట్లు పేద అక్కచెల్లెమ్మలకు పోతుందని ఏరోజైనా అనిపించిందా? ఆలోచన చేయండని వైఎస్ జగన్ ప్రజలను కోరారు.
ప్రసంగం అనంతరం.. మనమంతా కలిసే ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరిద్దాం రండి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలందరినీ ఆహ్వానించారు.