అమరావతి పరిధి గ్రామాల్లోని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇకపై ఆ ప్రాంత పేదలకు రెట్టింపు పెన్షన్అందించాలని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని పరిధిలోని సుమారు 17, 215 నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి గ్రామాల నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అమరావతి రాజధాని పరిధి గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఫిబ్రవరి 15న ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో అమరావతి రాజధాని పరిధిలోని నిరుపేద కుటుంబాలకు ఇకపై రెట్టింపు పెన్షన్ అనగా రూ. 5000 అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అమరావతి ప్రాంత నిరుపేద కుటుంబాలకు రెట్టింపు పెన్షన్ అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం జీవో ఎంఎస్ 33ని విడుదల చేసింది.
కాగా ఫిబ్రవరి నెల నుండి పెంచిన పెన్షన్ అందించనుండగా మార్చ్ నెల 1న ఫిబ్రవరి నెలలో అందించాల్సిన పెన్షన్ ను కూడా అందించనున్నట్లు రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని వారి అభివృద్ధి కోసం పలు సంస్కరణలతో కూడిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో ఎంఎస్ 33ని విడుదల చేయడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిబద్ధతకు నిదర్శనం అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.