ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే.. టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ ధర్మాన ప్రసాద్ తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామన్నారు.
భూముల పై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంనిర్ణయం.. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందన్నారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టిందన్నారు. మళ్లీ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. ఈ అంశంపై మాట్లాడడానికి ఏ వేదిక పైన,ఎప్పుడైనా, ఎక్కడైనా తాను సిద్ధమని టిడిపి వారితో చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు . ప్రస్తుతం టిడిపి కూటమిలో బిజెపితో పొత్తులో ఉంది. బిజెపి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని గురించి వారి వద్దే వివరణ తీసుకోవాలి అని కోరారు.
ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానాలలో ఉందని, న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత.. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే అమలు గురించి ఆలోచన చేస్తామంటూ ధర్మాన ప్రసాదరావు క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు. రైతులకోసం ఏరోజూ ఆలోచించని వారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెప్తుందని గుర్తుచేశారు.
చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుంది అని తెలిపారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా అని ధర్మాన అడిగారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా అని అడిగారు. రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా అని విపక్షాలను నిలదీశారు. మీ చేతిలో ఉన్నవి ఎల్లోమీడియా మాత్రమే, కాని ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయన్నారు.నిజాలను వారే అందరికీ వివరిస్తారన్నారు.