అన్నీ నేనే.. అంతా నేనే అని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల్లో హామీలివ్వడం తీరా గెలిచాక ఆ హామీలను తుంగలో తొక్కడం పరిపాటిగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తాగు నీటి విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజల చెవిలో పెద్ద పువ్వు పెట్టారు. ఆఖరికి మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుకు సొంతం. ఒకసారి తాగునీటి విషయంలో బాబు ఇచ్చిన హామీని పరిశీలిద్దాం.
2014 ఎన్నికల సందర్భంగా ‘ఎన్టీఆర్ సుజల’ ద్వారా రూ. 2/- కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తానని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల్లో గెలిచాక 20 లీటర్ల మాట పక్కనబెడితే ఒక్క లీటర్ నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆఖరికి ఆ ఇచ్చిన హామీ గురించి ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని మేనిఫెస్టోనే మాయం చేసాడు. ఇదే విధంగా ప్రతీ ఇంటికీ తాగునీరు అందిస్తామని 1999 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. 2000 సంవత్సరంలో రక్షిత మంచినీటి పథకాలను సరిగా అమలుచేయకపోవడంతో తాగునీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెదనందిపాడు లాంటి ప్రాంతాల్లో తాగునీరు దొరక్క, చెరువుల్లోని దుర్గంధపూరితమైన నీటిని తాగి పలువురు ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఆ సమయంలో కడవ చెరువు నీరుని ఐదు రూపాయలకు అమ్మడం గమనార్హం.
ఇలా తాగునీటి విషయంలో ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సురక్షిత మంచినీరు అందిస్తానని చంద్రబాబు కొత్త హామీతో రెడీ అయ్యాడు. గతంలో తాగునీటి విషయంలో హామీలిచ్చి వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే ప్రసక్తి లేదని పలువురు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ సుజల ద్వారా ఒక్క లీటర్ నీటిని కూడా అందించలేని బాబు మాటలను నమ్మలేమని గతంలో బాబు చేసిన మోసాలను మర్చిపోమని ప్రజలు వెల్లడిస్తున్నారు.