కూటమిగా ఏర్పడి ఎలక్షన్ కు ఉమ్మడిగా వెళ్తున్నా టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకుంటున్నారు. అలాంటి ఒక నియోజకవర్గమే పోలవరం. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుండి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. అయితే టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్ పోలవరం టికెట్ ఆశించారు. ఇది పేరుకే గిరిజన నియోజకవర్గం అయిన జనసేనలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం, టీడీపీలో పెత్తనమంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానిదే. ఇప్పుడు ఆ రెండు వర్గాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలతో జనసేనకు టికెట్ ఇస్తే మేము ప్రతీ విషయానికి జనసేనలోని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం దగ్గరికి పోవాల అంటూ రుసరుసలాడుతున్నారు. ఎలా అయిన ఇక్కడ టీడీపీకి టికెట్ వచ్చేలా చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి మొర పెట్టుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు కుదరదని చెప్పడంతో చివరి అవకాశంగా బొరగం శ్రీనివాస్ ను జనసేన లోకి తీసుకొని జనసేన తరుపున టికెట్ ఇప్పించాలని కోరారు. దీనికి చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
ఈ విషయం తెలుసుకుని ఆందోళనకు గురి అయిన జన సేన పార్టీ అభ్యర్థి బాలరాజు తనకు పార్టీ బి ఫారం దక్కుతుందా లేదా అని నిన్నటి వరకు ఆందోళనకు గురి అయ్యారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తనకు పార్టీ తరుపున బి ఫారం అందించడంతో కొంత ఊపిరి తీసుకున్నారు. కానీ బాలరాజుకు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు బొరగం శ్రీనివాస్ ,చంద్రబాబు సామాజిక వర్గ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ పెద్దలు, జనసేన పార్టీ పెద్దలు ఈ రెండు వర్గాలను కలిపి కూర్చోబెట్టి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక జనసేన నాయకులు కూడా ప్రచారంలో టీడీపీ నేతలకు అవకాశం లేకుండా ఒంటరిగానే వెళ్తున్నారు. చూస్తుంటే పోలవరంలో జనసేన కు టీడీపీ నేతల వెన్నుపోటు ఖాయంగా కనిపిస్తోంది.