జగన్ సర్కారు రైతుల ఇళ్లలో ఆనందం నింపింది. ఖరీఫ్ సీజన్ లో సేకరించిన ధాన్యానికి ఒక్క రోజులోనే చెల్లింపులు జరపడంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు జమచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు రూ.815 కోట్లను రైతులకు చెల్లించింది. ఇప్పటివరకూ ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లను ప్రభుత్వం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో రైతుల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం జమచేయనుంది.
రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం దళారులు, మిల్లర్ల దోపిడీకి తావులేకుండా ఆర్బీకే స్థాయిలోనే మద్దతుధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసిన జగన్ సర్కారు 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించగా, జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఆర్బీకే వ్యవస్థను రూపొందించి రైతు కళ్లాల దగ్గరే ధాన్యం కొనుగోలుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగా జగన్ ప్రభుత్వంలో ఏడాదికి సగటున 77 లక్షల టన్నుల కొనుగోలుకు ఎగబాకింది. అంతేకాకుండా గోనె సంచులు, హమాలీ ఖర్చులు, రవాణా ఖర్చులను కూడా జగన్ ప్రభుత్వం అందిస్తుండడంతో జగన్ పాలనలో రైతు రాజ్యం సాకారమైందని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.